డీపీఓలో కార్తీక వనభోజనం
కర్నూలు: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ పరిపాలన విభాగం ఉద్యోగులు బుధవారం డీపీఓ ఆవరణలో కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ హాజరై ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం పోలీసు మినిస్టీరియల్ సిబ్బందితో కలసి ఉసిరి చెట్టు కింద వన భోజనం చేశారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే మంచి జరుగుతుందని, అందరూ ప్రతి సంవత్సరం ఈ విధంగా కుటుంబ సభ్యులతో కలసి ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుని సంతోషంగా ఉండాలని ఎస్పీ ఆకాంక్షించారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, డీఐజీ కార్యాలయ మేనేజర్ రత్నప్రకాష్, డీపీఓ ఏఓ జయలక్ష్మి, ఏపీఎస్పీ రెండో బెటాలియన్ ఏఓ దేవి పాల్గొన్నారు.
తేమ 14 శాతం ఉన్నా పత్తి కొనుగోళ్లు
కర్నూలు సిటీ: సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు స్లాట్ బుకింగ్‌లో ఎదురవుతున్న సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని, పత్తిలో 14 శాతం తేమ ఉన్నప్పటికీ రైతులను వెనక్కు పంపకుండా కొనుగోళ్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి తెలిపారు. బుధవారం కర్నూలు రూరల్ మండల పరిధిలోని ఆర్.కొంతలపాడు గ్రామంలో అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది ఉల్లి పంటకు మంచి ధర ఉండడంతో ఈ ఏడాది ఉల్లి పంట అధికంగా సాగైందన్నారు. జిల్లాలో అత్యధిక శాతం రైతులు లోకల్ విత్తనాలు వాడుతుండడం, ఈ ఏడాది అధికంగా కురిసిన వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఎత్తు మడులు వేసి అందులో ఉల్లిని సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మీ, ఉద్యాన శాఖ జిల్లా అధికారి రాజాకృష్ణరెడ్డి, ఎల్‌డీఎం రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు(హాస్పిటల్): ఉద్యోగుల పనితీరు, వారి సమయపాలన, ఆసుపత్రి, రోగులు, వారి సహాయకులు, ప్రజల భద్రతకు ఉద్దేశించి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. ఆసుపత్రిలోని పరిపాలనా భవనానికి వెళ్లే మెట్ల మార్గంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ గది ఉంది. దాని ముందు జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. కార్యాలయానికి వెళ్లే వారి వివరాలు ఈ సీసీ కెమెరా ద్వారానే తెలుస్తుంది. ఇలాంటి కీలక ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఒకటి కొంత కాలంగా కిందకు వంగిపోయి ఉంది. దీంతో ఎలాంటి సమాచారం రికార్డు కావడం లేదు. కాస్త సరిచేస్తే పని చేసే సీసీ కెమెరాను అలాగే వదిలేయడం సీసీ కెమెరాల పర్యవేక్షణపై నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం.
డీపీఓలో కార్తీక వనభోజనం
డీపీఓలో కార్తీక వనభోజనం


