అనుమానాస్పదస్థితిలో ఒడిశా యువకుడి మృతి
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని శివ సర్కిల్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం సమీపంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన టికెలాల్ ఒరియా(36) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒడిస్సాకు చెందిన టికెలాల్ ఒరియా మండల పరిధిలోని చెన్నాపురం గ్రామం వద్ద ఇటుకల బట్టిలో పనిచేస్తున్నాడు. పని ముగించుకుని సాయంత్రం ఎమ్మిగనూరుకు వెళ్లివస్తానని తోటి కూలీలతో చెప్పి బయలుదేరాడు. మంగళవారం ఉదయం ఏటీఎం ఎదుట రోడ్డుపై విగతజీవిగా పడు ఉన్నాడు. గమనించిన కాలనీ వాసులు పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. ఆధార్, పాన్ కార్డుల ఆధారంగా చెన్నాపురం బట్టి వద్ద ఉన్న తోటి కూలీలను రప్పించి వివరాలు ఆరా తీశారు. కొన్ని రోజులుగా మృతుడు మూర్చవ్యాధితో బాధపడేవాడని ప్రాథమిక విచారణలో తేలిందని, కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పట్టణ పోలీసులు తెలిపారు.


