ఆరా తీయకుండా అద్దెకివ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

ఆరా తీయకుండా అద్దెకివ్వొద్దు

Nov 19 2025 6:15 AM | Updated on Nov 19 2025 6:15 AM

ఆరా త

ఆరా తీయకుండా అద్దెకివ్వొద్దు

అద్దె ఇళ్లలో జూదం, వ్యభిచారం

పెరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు

అధిక అద్దె ఆశతో ఎవరికి పడితే వారికి ఇల్లు ఇవ్వద్దని పోలీసుల సూచన

సమాచారం ఇవ్వాలి

కర్నూలు నగర శివారులోని వీకర్‌ సెక్షన్‌ కాలనీలో కొన్ని నెలల క్రితం పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఓ ఇంటి రెండో అంతస్తులో తనిఖీ చేసి అక్కడ జూదం ఆడుతున్న బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీ అండ ఉన్న ఒకరు ఇల్లు అద్దెకు తీసుకుని కొంతకాలంగా జూదం సాగిస్తున్నట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది.

తాజాగా ఉల్చాల రోడ్డు ఆదిత్య నగర్‌ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న ఓ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయగా లోపల వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు బయటపడింది. డోన్‌కు చెందిన హరి యాదవ్‌ ఇల్లు అద్దెకు తీసుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచార తతంగాన్ని నడిపించాడు. గతంలోనూ అతడు వేరే చోట అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహించడంతో యజమాని వెళ్లగొట్టినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది.

కర్నూలు–గుత్తి రోడ్డులోని రామచంద్ర నగర్‌ శివారులో అనుమానాస్పదంగా ఉన్న ఓ ఇంటిని చుట్టుముట్టి పోలీసులు తనిఖీలు చేపట్టారు. లోపల వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు గుర్తించి ముగ్గురు విటులు, ఐదుగురు సెక్స్‌ వర్కర్లతో పాటు నిర్వాహకులను అరెస్టు చేశారు. దీన్ని నిర్వహిస్తోంది మహిళ కావడం గమనార్హం. నివాసముండేది వేరే కాలనీలో అయినా ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కొన్ని నెలలుగా తతంగం నడిపించినట్లు విచారణలో బయటపడింది.

సులువుగా డబ్బు సంపాదించేందుకు కొంతమంది అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికి అనుమానం రాకుండా ఇళ్లను అద్దెకు తీసుకుని జూదం, వ్యభిచారం, మద్యంపానం వంటి వాటిని నిర్వహిస్తున్నారు. జన సంచారం అంతగా ఉండని ప్రాంతాలు, కాలనీలు, యజమానులు లేకుండా ఉన్న ఇళ్లను ఇందుకోసం ఎంచుకుంటున్నారు. దీనివల్ల వేళాపాలాతో సంబంధం లేకుండా వచ్చి వెళ్లే వారిని అక్కడ జరిగే వ్యవహారాలను పట్టించుకునేవారు ఉండరు. నిర్వాహకులకు సంబంధించిన వారు లేదా సమాచారం అందుకున్న వారు మాత్రమే అక్కడికి వచ్చే వీలుంటుంది. ఫలితంగా అక్రమ తతంగానికి ఎలాంటి ఆటంకం ఏర్పడదన్న ధీమా వారిని మరింత ప్రోత్సహిస్తోంది.

పోలీసులనే బెదిరించే స్థాయిలో

నిర్వాహకులు..

అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించేవారికి ప్రభుత్వ పెద్దల అండ ఉండటంతో కొందరు తనిఖీలకు వెళ్లిన పోలీసులను బెదిరించే స్థాయిలో ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కర్నూలులో పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే మంత్రి అండతో డెన్‌ నిర్వాహకుడు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నుంచి విముక్తి పొందాడు. అలాగే కర్నూలు విష్ణు టౌన్‌షిప్‌ శివారులో భారీగా వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు పలువురు మహిళలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిర్వాహకురాలు ఓ రాజకీయ పార్టీ మహిళా నాయకురాలు కావడంతో ఆమెకు ఉన్నతాధికారులతో ఉన్న పరిచయాన్ని అడ్డుగా పెట్టుకుని దాడికి వెళ్లిన పోలీసు అధికారినే బెదిరించినట్లు అప్పట్లో చర్చ జరిగింది. ఇలా మట్కా, పేకాట, వ్యభిచార నిర్వాహకులు కొంతమంది అధికార పార్టీ నాయకుల అండతో పోలీసులనే బెదిరించే స్థాయిలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది.

యజమాని దృష్టి సారిస్తేనే...

ఇంటి కోసం వచ్చిన వారికి అద్దె, ఇంట్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు, ఠంచన్‌గా అద్దె చెల్లించాలని చెప్పడమే గాకుండా వచ్చిందెవరో పూర్తిస్థాయిలో ఆరా తీయాలి. అవసరమైతే వారి సంబంధీకుల వివరాలు తెలుసుకోవాలి. అన్నీ నిర్ధారించుకుని ఇంటిని అప్పగించాలి. యజమాని హోదాలో తరచూ ఇంటికి వెళ్తుండటం, తరచూ పరిశీలిస్తూ ఉండటం, నిర్వాహకులను పరిశీలించడం, వారు చేసే కార్యకలాపాలపై దృష్టి సారించడం తప్పనిసరి.

ఇల్లు ఖాళీగా ఉందని.. ఎవరో ఒకరు వచ్చారని.. అడిగినంత అద్దె ఇస్తారని ఆశ పడే ఓనర్లు కొందరు.. నెలనెలా ఎంతో కొంత ఆదాయం వస్తుందని ముక్కూమొహం తెలియని వాళ్లకు ఇల్లు అద్దెకు ఇస్తున్న వారు ఇంకెందరు.. అయితే అద్దెకు అడిగే వారి స్వభావం తెలుసుకోకుండా, కనీస వివరాలను కూడా ఆరా తీయకుండా అద్దెకు ఇస్తే లేనిపోని తలనొప్పులు తప్పవంటున్నారు పోలీసులు. పరోక్షంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా కల్పించిన వారవుతారని, ఒక్కోసారి కేసుల్లో కూడా ఇరుక్కునే ప్రమాదమూ లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. – కర్నూలు

చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా అనుమానాస్పద ఘటనలు జరిగినా, వ్యక్తుల సంచారం కనిపించినా డయల్‌ 112, 100 లేదా సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలి. మన చుట్టుపక్కల నివాసాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను గుర్తించినా పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలి.

– విక్రాంత్‌ పాటిల్‌, ఎస్పీ

ఆరా తీయకుండా అద్దెకివ్వొద్దు 1
1/1

ఆరా తీయకుండా అద్దెకివ్వొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement