● 9 తులాల బంగారం, 55 తులాల వెండి, రూ.లక్ష నగదు స్వాధీన
దొంగ దొరికాడు
కర్నూలు: ఇళ్ల దొంగతనాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న దొంగను సి.బెళగల్ పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్టు చేశారు. అతని వద్ద 9 తులాల బంగారు ఆభరణాలు, 55 తులాల వెండి, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకుని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఎదుట హాజరుపర్చగా కోడుమూరు సీఐ తబ్రేజ్, బెళగల్ ఎస్‌ఐ వేణుగోపాల్ రాజుతో కలిసి మంగళవారం తన కార్యాలయంలో డీఎస్పీ.. వివరాలు వెల్లడించారు. సి.బెళగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిమ్మందొడ్డి గ్రామానికి చెందిన తెలుగు చిన్నరెడ్డి ఇంట్లో సెప్టెంబర్ 25న చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా పాత నేరస్తులపై నిఘా ఉంచి విచారణ చేశారు. నేరం జరిగిన రోజు సీసీ ఫుటేజీల ఆధారంగా తిమ్మందొడ్డి గ్రామానికి చెందిన గిర్నీ వెంకటేష్ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. బెళగల్ నుంచి చింతమానుపల్లె గ్రామానికి వెళ్లే దారిలో గుట్టల నాగమ్మ గుడి వద్ద నిందితుడు ఉన్నట్లు గుర్తించి వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.9.25 లక్షల విలువచేసే 9 తులాల బంగారు ఆభరణాలు, 55 తులాల వెండి, రూ.లక్ష నగదు రికవరీ చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ వెల్లడించారు. అనతి కాలంలోనే కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరచిన ఎస్‌ఐ వేణుగోపాల్ రాజు, ఏఎస్‌ఐలు నాగయ్య, హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్ప, కానిస్టేబుళ్లు మల్లికార్జున, సుధాకర్, భాస్కర్, సుదర్శన్, సత్యరాజు తదితరులను డీఎస్పీ అభినందించారు.


