మోసగాళ్లు దొరికారు
ఆళ్లగడ్డ: వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామంటూ రూ. కోట్లలో డబ్బులు వసూళ్లు చేసి చివరకు బోర్డు తిప్పేసి పరారీలో ఉన్న నిందితులను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. సోమవారం స్థానిక డీఎస్పీ కార్యాలయ ఆవరణలో నిందితుల వివరాలను విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రమోద్ వివరించారు. 2023లో వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ పేరుతో నలుగురు వ్యక్తులు కంపెనీ స్థాపించి కూకట్‌పల్లి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కంపెనీ, వ్యక్తిగత బ్యాంకు ఖాతాలను ప్రారంభించారు. వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు సృష్టించి ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ కంపెనీల గ్రాఫ్ స్క్రీన్‌షాట్‌లు పంపాలని సూచిస్తూ వాటిని జాబ్‌వర్క్‌గా చూపించి నెలకు రూ.40 వేలు జీతం ఇస్తామని చెబుతూ ప్రజలను నమ్మించారు. మొదట కుటుంబ సభ్యులను చేర్చుకుని జీతాలు ఇస్తూ ప్రచారం చేశారు. దీంతో గ్రామాల వారీగా ప్రజల్లో ఆశ కల్పించారు. దీంతో ఒక్కొక్కరి నుంచి రూ.2.50 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు వసూలు చేశారు. ఇందులో అనంతపురం జిల్లా గొడ్డుమర్రి గ్రామంలో 250 మంది, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 950 మంది నుంచి ఉద్యోగాలు ఇస్తామంటూ డబ్బులు వసూలు చేశారు. మొత్తం రెండు జిల్లాల నుంచి 1,200కి పైగా చేర్చుకుని వారి నుంచి రూ.35 కోట్ల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అయితే ఈ ఏడాది అక్టోబర్ నెలలో బాధితులకు జీతాలు నిలిపి వేయడంతో అందరూ రోడ్డెక్కడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా బాధితులు వందల్లో ఉన్నారని తెలుసుకుని విచారణ చేపట్టారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులు అనంతపురం జిల్లా యల్లనూరు మండలం గొడ్డుమర్రి గ్రామానికి చెందిన అంతపు రాజారెడ్డి, నంద్యాల జిల్లా రుద్రవరం మండలం కొండమాయపల్లె గ్రామానికి చెందిన సింగతల ఉమామహేశ్వరరెడ్డి, దొర్నిపాడుకు చెందిన బాచిరెడ్డి వీరారెడ్డి, బాచిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ప్రమోద్ వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోని బాధితులు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. సులభంగా డబ్బు వస్తుందని ఎవరూ ఇలాంటి మోసపూరిత పథకాలను నమ్మవద్దన్నారు. ఇలాంటి కంపెనీలు, మోసపూరిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సమావేశంలో రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి, ఎస్‌ఐ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వెల్త్ అండ్ హెల్త్ కేసులో
నలుగురు నిందితుల అరెస్ట్
1,200 మందిని బాధితులుగా
గుర్తించిన పోలీసులు
రూ.35 కోట్లు వసూళ్లు చేసినట్లు
దర్యాప్తులో వెల్లడి


