అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి
● ఇద్దరి శరీరంపై కాలిన గాయాలు
● మహిళ ఇంటిలో ఘటన ● దర్యాప్తు చేపట్టిన పోలీసులు
డోన్ టౌన్: డోన్ పట్టణంలో ఓ మహిళ, ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనతో పట్టణంలో కలకలం రేగింది. స్థానిక రాజ్ టాకీస్ వెనుక వీధిలోని ఒక ఇంటిలో నివాసముంటున్న అశ్విని(35), పాతపేటకు చెందిన ఫరీధ్ (52) అనుమానాస్పద స్థితిలో మృతి చెందా రు. వీరి మధ్య సాన్నిహిత్యం ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. అశ్విని కుటుంబం గతంలో పాతపేటలో ఫరీద్ ఇంటి సమీపంలో ఉండగా, కొద్ది నెలల క్రితం రాజ్ టాకీస్ వెనుక ఉన్న వీధిలో ఇల్లు కొనుగోలు చేసి అక్కడికి చేరింది. సోమవారం సాయంత్రం అశ్విని కుమార్తె పాఠశాల నుంచి ఇంటికి చేరుకోగా.. ఇంటిలో తల్లితో పాటు మరో వ్యక్తి మృతి చెంది కనిపించడంతో కేకలు వేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న కుటుంబీకులు అక్కడకికి చేరుకున్నారు. ఇద్దరి శరీరంపై కాలిన గాయాలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని, పరిసరాలను గమనించి ఉన్నతాధికారులకు, ఫోరెనిక్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంటసీఐ రాకేష్, ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. కాగా అశ్విని నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా అడ్డుకోబోయిన ఫరీద్ కూడా గాయపడి మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టులో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని సీఐలు తెలిపారు.
మృతుడు ఫరీద్ , అశ్విని (ఫైల్)
అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి
అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి


