ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొని లారీ దగ్ధం
ఆస్పరి: ఆస్పరి మండలంలోని చిన్నహోతూరు బస్టాప్ సమీపంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను లారీ ఢీకొని కాలిపోయింది. డ్రైవర్, క్లీనర్ వెంటనే కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ఆస్పరి సీఐ గంగాధర్ తెలిపిన వివరాల మేరకు.. బళ్లారి నుంచి నంద్యాలకు క్లింకర్ (సిమెంట్, కంకర మిశ్రమం) లోడుతో వస్తున్న లారీ చిన్నహోతూరు బస్టాప్ సమీపంలో ఉన్న స్పీడు బ్రేకర్ దగ్గర డ్రైవర్ తన ముందు వాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు పక్కకు తిప్పాడు. అదుపు తప్పిన లారీ పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌ను ఢీకొట్టింది. వెంటనే షార్ట్ సర్క్యూటై మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ వెంటనే కిందకు దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చెలరేగిన మంటలు పక్కనే ఉన్న అదే గ్రామానికి చెందిన బోయ రంగన్నకు సంబంధించిన వరి గడ్డి, జొన్న సోప్ప ఉన్న వాముల్లోకి పడడంతో అవి పూర్తిగా కాలిపోయాయి. దీంతో సదరు రైతుకు రూ.50 వేలు నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న ఆలూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో లారీ ముందు భాగం, పది టైర్లు పూర్తిగా కాలిపోయాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


