తల్లిదండ్రుల సంరక్షణ వదిలేస్తే జైలుశిక్ష
కర్నూలు(అర్బన్): తల్లిదండ్రుల సంరక్షణను పట్టించుకోకుండా వీధుల్లో వదిలేసిన వారిపై క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం మూడు నెలల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీ లీలా వెంకటశేషాద్రి తెలిపారు. సోమవారం ఆయన నగరంలోని మద్దూర్‌నగర్ అమ్మ వృద్ధుల ఆశ్రమం, బీ క్యాంప్‌లోని మన వృద్ధుల ఆశ్రమాల్లో తల్లిదండ్రులు, వయో వృద్ధ పౌరుల భరణం, పోషణ చట్టం–2007పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి జి. కబర్ధి సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పట్టించుకోని పిల్లలపై తల్లిదండ్రులు మెయింటెనెన్స్ కేసులు వేసి వారి నుంచి తమ జీవనానికి భరణాన్ని పొందవచ్చన్నారు. వృద్ధులకు ఎవరికై నా న్యాయ సహాయం కావాలంటే నేరుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను, లేదా టోల్ ఫ్రీ నెంబర్ 15100కు ఫోన్ చేసి సమస్యను చెప్పుకోవచ్చన్నారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ న్యాయవాది రాంపుల్లయ్య, ఆశ్రమాల నిర్వాహకులు పాల్గొన్నారు.


