వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి దుర్మార్గం
కర్నూలు (టౌన్): హిందూపురంలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయాన్ని టీడీపీ గూండాలు విధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. ఆదివారం స్థానిక సీ.క్యాంపులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం రాజకీయ కక్షతో చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై చేస్తున్న దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. దాడులతో వైఎస్సా ర్‌సీపీ నాయకులను బెదిరించలేరన్నారు. ప్రజల్లో ఇప్పటికే బాబు సర్కార్‌పై పూర్తి వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విజయాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు.
24న డాక్టర్ ఖాదర్‌వలి కర్నూలు రాక
కర్నూలు(అగ్రికల్చర్): ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ స్పెషలిస్టు, పద్యశ్రీ అవార్డు గ్రహాత డాక్టర్ ఖాదర్ వలి ఈ నెల 24న కర్నూలుకు రానున్నారు. చిరుధాన్యాల వినియోగంపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు సీ.క్యాంపు సెంటరులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారని అధితి చిరుధాన్యాల ప్రతినిధులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
క్వింటా పత్తిని రూ.12 వేల ప్రకారం కొనుగోలు చేయాలి
కర్నూలు(సెంట్రల్): రైతులు పండించిన పత్తిని క్వింటాలు రూ.12 వేల ప్రకారం సీసీఐ ద్వారా కొనుగోలు చేయించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం డిమాండ్ చేశారు. ఆదివారం సీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మంగళ, బుధవారాల్లో ఆదోనిలోని రోషన్ గార్డెన్స్‌లో జరిగే పత్తి రైతుల సమ్మేళనాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, కార్యదర్శివర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, రావుల వెంకయ్య, మాజీ మంత్రి రఘువీరారెడ్డి హాజరు కానున్నట్లు చెప్పారు.
తిప్పాయపల్లెలో దొంగలు హల్‌చల్
ఓర్వకల్లు: మండలంలోని తిప్పాయపల్లె గ్రామంలో దొంగలు హల్‌చల్ చేశారు. వరుసగా నాలుగు ఇళ్లలో చొరబడి దొంగతనం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కురువ బాలమద్దిలేటి, బైరాపురం చంద్రశేఖర్‌రెడ్డి, వడ్డె రవిచంద్రుడు ఇళ్లకు తాళం వేసి వేర్వేరు ప్రాంతాలో జీవనం సాగిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఆ ఇళ్లకు వేసిన తాళం గడియలను ఆక్సిల్ బ్లేడుతో కోసి ఇళ్లలోకి చొరబడి అందిన కాడికి దోచుకెళ్లారు. కురువ బాలమద్దిలేటి ఇంట్లో 15 తులాల బంగారు ఆభరణాలు, బైరాపురం చంద్రశేఖర్‌రెడ్డి ఇంట్లో రూ.30 వేల నగదు, వడ్డె రవిచంద్రుడు ఇంటిలో రూ.7 వేలు, ముల్ల బషీర్ అహ్మద్ ఇంట్లో సుమారు రూ.25 వేల నగదు దోచుకెళ్లినట్లు తెలిసింది. బాధితులు ఆదివారం ఇంటికి వెళ్లి చూడగా చోరీ జరిగిన విషయం తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు విచారణ చేపట్టారు.
వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి దుర్మార్గం


