సీమ వెనుకబాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం
● రాయలసీమ ప్రయోజనాల కోసం
నిరంతర పోరాటం
● డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి
కర్నూలు(అర్బన్): రాయలసీమ వెనకబాటు తనానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్ భవన్‌లో శ్రీబాగ్ ఒడంబడిక అమలు చేయాలనే డిమాండ్‌పై సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక వేత్తలతో వేలకోట్ల రూపాయాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారన్నారు. రాయలసీమ ప్రయోజనాల కోసం జరిగిన శ్రీబాగ్ ఒప్పందాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పలుమార్లు ప్రధానమంత్రితో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు రాయలసీమ జిల్లాలో పర్యటించారని, ఏ ఒక్కరికి కూడా శ్రీబాగ్ ఒప్పందం గురించి మాట్లాడేందుకు నోరు రాకపోవడం దురదృష్టకరమన్నారు. అనేక రూపాల్లో నష్టపోతున్న రాయలసీమ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు తన తుది శ్వాస విడిచేంత వరకు పోరాటం అపబోమన్నారు. రాయలసీమ ఎప్పటికై తే ప్రత్యేకంగా ఉంటుందో అప్పుడే ఇక్కడి ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. సహజ వనరులు, భౌగోళిక పరిస్థితులు ఎంతో అనుకులంగా ఉన్న రాయలసీమను అభివృద్ధి చేయడంలో పాలక ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆయన విమర్శించారు. అమరావతి, విశాఖపట్నం ప్రాంతాల్లోనే వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేసేందుకు చూస్తున్న పాలకులు రాయలసీమపై కూడా దృష్టి సారించాలన్నారు. సాగు, తాగునీటికి ఇబ్బంది పడుతున్న రాయలసీమ ఎడారి కాకముందే ఇక్కడి ప్రజలు మెల్కోవాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమ పౌరుషాన్ని చూపించకపోతే భావితరాలు మనల్ని క్షమించబోవన్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ కంటే రాయలసీమ చాలా వెనకబడి ఉందని గతంలో శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పిందన్నారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, రాయలసీమ రాష్ట్ర సమితి మైనార్టీ నాయకులు ఖాదర్ వలి, బి. ముసికిన్, సుభాన్, రాజశేఖర్, ఖాసీం వలి, మీడియా కోఆర్డినేటర్ ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు.


