ఔటర్ రింగ్ రోడ్డులో ఆటోవాలాల స్టంట్లు
కర్నూలు: నగర శివారులోని జగన్నాథగట్టు వద్ద అవుటర్ రింగ్ రోడ్డులో బైక్ రేసింగ్‌లు, ఆటోవాలాల స్టంట్‌లు మితిమీరాయి. ఈ ప్రాంతంలో పోలీసు గస్తీ అంతంత మాత్రంగా ఉండటంతో ఆకతాయిలు గుంపులుగా చేరి బైక్ రేసింగ్‌లు, ఆటోలతో స్టంట్లు చేస్తూ రీల్స్ చేసి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టులు పెడుతున్నారు. గత కొంతకాలంగా ఆకతాయిలకు ఈ ప్రాంతం అడ్డాగా మారింది. రౌడీషీటర్లు కూడా మద్యం సేవించి గట్టు ప్రాంతానికి వచ్చే ప్రేమికులను బెదిరించి నిలువు దోపిడీకి పాల్పడి కటకటాల పాలైన సంగతి తెలిసిందే. ఆటోవాలాలు మద్యం మత్తులో రోడ్డుపైనే ఆటోలతో స్టంట్లు చేస్తూ రీల్స్ చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టులు పెడుతున్నట్లు సమాచారం అందడంతో ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. నాలుగు ఆటోలతో స్నేక్ డ్రైవింగ్, స్టంట్‌లు చేస్తూ వీడియోలు తీస్తుండగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కొత్తపేట వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. స్టంట్‌ల వల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో వివరించి నలుగురిపై కేసు నమోదు చేశారు. ఆటోలతో స్టంట్‌లు, ర్యాష్ డ్రైవింగ్‌లకు పాల్పడుతూ.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తే 112 లేదా 100 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు.


