ఎత్తిపోయిన పథకాలు!
దుద్ది రిజర్వాయర్ కింద 15 ఎకరాల భూమి సాగుచేసుకున్నా. ఖరీఫ్‌లో భారీ వర్షాలు కారణంగా పత్తి, ఉల్లి పంటలు పూర్తి దెబ్బతిన్నాయి. కనీసం పెట్టుబడి రాక అప్పులు మిగిలాయి. రబీలో వేరుశన, మిరప, ఉల్లి పంటలు సాగు చేసుకున్నా. ఇప్పుడు ఎల్లెల్సీ కాల్వకు నీళ్లు ఇవ్వమని అధికారులు చెబుతున్నారు. పంటలను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
– తిమ్మయ్య, ఆయకట్టు రైతు, కోసిగి
కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోంది. గతంలో ఖరీఫ్‌లోనే మండలంలోని దుద్ది, మూగలదొడ్డి రిజర్వాయర్లు నిండుగా నీటితో నింపేవారు. ఎల్లెల్సీ నీరు తగ్గిన వెంటనే ఆ రిజర్వాయర్ నీటితో పంటలను పండించుకునే వాళ్లం. కానీ ఈ ఏడాది ఎల్లెల్సీ నీరు ఇవ్వమంటున్నారు. వర్షకాలంలో పంటలు దెబ్బతిన్నాయి, రబీలోను పంటలు లేక పోతే రైతులు ఎలా బతకాలి?
– నాడుగేని వీరారెడ్డి, రైతు, కోసిగి
కోసిగి: భారీ వర్షాలు కురిసి తుంగభద్ర నది నిండుగా ప్రవహించినా రైతుల కష్టాలు తొలగలేదు. ఎత్తిపోతల పథకాలు పనిచేయకపోవడం, తుంగభద్ర దిగువ కాలువకు జనవరి 10 వరకే నీరు ఇస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాలన్నీ బీళ్లుగా మారుతాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎల్లెల్సీ (తుంగభద్ర దిగువ కాలువ)కింద చివరి ఆయకట్టుకు నీరు అందకపోవడాన్ని గమనించి 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. తుంగభద్ర నది ఒడ్డున దుద్ది, మూగలదొడ్డి, మాధవరం, బసలదొడ్డి ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసి పుష్కలంగా చివరి ఆయకట్టుకు సాగునీరు అందించారు.
సాగుకు ‘చంద్ర’గ్రహణం
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎత్తిపోతల పథకాలను పట్టించుకోలేదు. తుంగభద్ర నది నిండుగా ప్రవహించే సమయంలో ఎత్తిపోతల పథకాల పంప్‌హౌస్‌ల నుంచి రిజర్వాయర్లను నీటితో నింపాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలకు నిర్వహణ నిధులు మంజూరు చేయలేదు. దీంతో పంప్ హౌస్‌లు పనిచేయలేదు. ఫలితంగా రిజర్వాయర్లు నీరు లేక వెలవెలబోతున్నాయి.
‘దుద్ది’ ఎత్తిపోయింది!
తుంగభద్ర నది ఒడ్డున సాతనూరు సమీపంలో నిర్మించిన దుద్ది ఎత్తిపోతల పథకం మిషన్లు ఏడాది మరమ్మతులు చేయలేదు. రిజర్వాయర్‌కు చుక్క నీరు కూడా పంపింగ్ చేయలేదు. ఈ రిజర్వాయ కింద దుద్ది, కోసిగి, దేవరబెట్ట, డి.బెళగల్ వరకు 3,500 ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. అలాగే నీటిని సరఫరా చేసే దుద్ది పొలాల్లో నెల రోజల క్రితం పైప్‌లైన్ పగిలిపోయింది. ఇంత వరకు మరమ్మతులు చేపట్టక లేక పోయారు. నదిలో వృథా నీరు దిగువ ప్రాంతాలకు తరలి పోయాయి. ఖరీఫ్ ముగిసి పోయినా రిజ్వాయర్ వైపు పాలకులు, అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రబీలో నైనా సాగు చేసుకుందామనుకున్నా జనవరి 10 వరకే నీరు ఇస్తామని చెబతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది పంటలు లేక బతుకు భారమై వలస బాట పడుతున్నారు.
‘మూగ’నోము
మూగలదొడ్డి ఎత్తిపోతల పథకం కింద 3,700 ఎకరాలు ఆయకట్టు భూములు ఉన్నాయి. మూగలదొడ్డి, అగసనూరు, జంపాపురం, చిర్తనకల్లు, ఐరన్‌గల్లు, సాతనూరు వరకు ప్రవహిస్తోంది. ఎత్తి పోతల పథకం వద్ద రెండు మిషన్లు ఉన్నారు. ఒకటి మరమ్మతులకు గురైనా మరమ్మతులు చేయలేదు. ఒక మిషన్‌తో రైతులు దగ్గరుండి పంపింగ్ చేయించుకుంటున్నారు. ఒక మిషన్‌తో రిజర్వాయర్‌లోకి అరకొరగా వచ్చి చేరుతున్నారు. దీంతో రిజర్వాయర్‌లో పుష్కలంగా సాగునీరు నిండలేదు. అలాగే మంత్రాలయం మండలంలోని మాధవరం, బసలదొడ్డి ఎత్తి పోతల పథకాలకు గతేడాది ఒక్క చుక్క నీరు కూడా అందించలేక పోయారు. ఈ ఏడాది కూడా అందిస్తారో లేదో నని రైతులు ఎదురు చూపులే మిగిలాయి.
ఈ ఏడాది దుద్ది రిజర్వాయర్‌కు
చుక్క నీరు నింపని వైనం
పంప్ హౌస్ మరమ్మతులు
పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
తుంగభద్ర దిగువ కాలువకు
జనవరి 10 వరకే నీరు
పొలాలు బీళ్లు అవుతాయనే
ఆందోళనలో అన్నదాతలు
ఎత్తిపోయిన పథకాలు!
ఎత్తిపోయిన పథకాలు!


