ఊరూరా కష్టాలు.. కన్నీళ్లు!
కోవెలకుంట్ల/కోడుమూరురూరల్/హాలహర్వి/కౌతాళం: చంద్రబాబు ప్రభుత్వంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండి ప్రజలు కష్టాలు పడుతున్నారు. పంటలు పండక రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పలు గ్రామ సచివాలయాలు అసంపూర్తిగా ఉండి అవస్థలు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మందుబాబులు మద్యం సేవించి సీసాలు పగులగొడుతున్నారు. ఊరూరా కష్టాలు.. కన్నీళ్లు కనిపిస్తుండటంతో ‘ఇదేం పాలన’ అని ప్రజలు పెదవి విరుస్తున్నారు.
తొలగని ‘దారి’ద్య్రం
హాలహర్వి మండలంలోని గూళ్యం–బల్లూరు గ్రామ రహదారి కంకరతేలి గుంతలతో అధ్వానంగా మారింది. ఏడాదిగా గ్రామ రహదారి బాగుపడడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఉదయం పాఠశాలలకు వెళ్లేందుకు వాహనాల్లో ఈ మార్గం గుండానే విద్యార్థులు వెళ్తుంటారు. రోడ్డుబాగా లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ రహదారిలో ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రగతి..ఆధోగతి
కోడుమూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని గ్రామ సచివాలయ భవనం నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో ఈ భవనంలో పగలు, రాత్రి అన్న తేడా లేకుండా కొందరు ఆకతాయిలు నిత్యం మద్యం తాగుతున్నారు. ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. భవనంపైనే కాంట్రాక్టర్ ఇసుక, కంకరను అలాగే వదిలేశారు. దీంతో వర్షాలకు నీళ్లు నిలిచిపోయి భవనం దెబ్బతింటోంది.
అసాంఘిక చర్యలు
కౌతాళంలోని కన్నడ ప్రాథమిక పాఠశాల కాంపౌండ్‌లో విద్యార్థులు నిత్యం ప్రార్థన చేసే స్థలంలో బీర్ బాటిళ్లను పగలగొట్టారు. గాజు ముక్కల్ని చెల్లాచెదురుగా పడేశారు. పంచాయతీ కార్యాలయానికి పక్కనే ఈ పాఠశాల ఉంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల కాంపౌండ్‌లోకి దూకి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు. విద్యార్థులు ప్రార్థన చేసే స్థలంలో ఇలా చేయడం చాలా బాధాకరం అని, వారిని శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
మిరప పైరును తొలగించి..
కోవెలకుంట్ల మండలం రేవనూరులో ఇటీవల తుపాన్‌తో కురిసిన భారీ వర్షాలు మిరప రైతులకు కన్నీటిని మిగిల్చాయి. గ్రామానికి చెందిన హనుమంతు రెడ్డి నాలుగు ఎకరాల సొంత పొలంలో ఈ ఏడాది జూలై నెలలో మిరప పంట సాగు చేశాడు. ఎకరాకు రూ. 90 వేలు ఖర్చు చేశాడు. నాలుగు నెలల పంట కావడంతో మొక్కకు 60 నుంచి 70 మిరప కాయలు కాశాయి. గత నెలాఖరులో తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురియడంతో పైరులో తేమ శాతం అధికమై వేరుకుళ్లు తెగులు ఆశించి పైరంతా ఎండిపోయి దెబ్బతినింది. అలాగే ఇదే గ్రామానికి చెందిన ప్రసాద్ అనే మరో రైతు ఎకరా రూ. 40 వేలు కౌలు చెల్లించి మూడున్నర ఎకరాల్లో మిరప పంట సాగు చేశాడు. ఎకరాకు రూ. లక్ష చొప్పున పెట్టుబడుల రూపంలో వెచ్చించాడు. భారీ వర్షాలతో వేరుకుళ్లు తెగులు ఆశించి పైరు పూర్తిగా దెబ్బతినింది. పంటను కాపాడుకునేందుకు రైతులు చేసిన ప్రయత్నమంతా వృథా కావడంతో విధిలేని పరిస్థితుల్లో పైరును తొలగించారు. అధికారులు పంటనష్టం అంచనా వేసి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.


