సివిల్స్‌కు ఉచిత శిక్షణ
కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.ప్రసూన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన వారై ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు రెండు ఫోటోలు, విద్య, కుల, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్, పాన్ కార్డు తదితర జిరాక్స్ కాపీలను జతపరిచి ఏపీ బీసీ స్టడీ సర్కిల్, కల్లూరు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా, కల్లూరు చిరునామాలో స్వయంగా వచ్చి దరఖాస్తులను ఈ నెల 25లోగా అందించాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు బీసీ భవన్, గొల్లపూడి, విజయవాడలో ఉచిత శిక్షణను అందించేందుకు ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటైందన్నారు. అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. వివరాలకు 08518– 236076 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
‘పది’ విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు
నందవరం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులందరికీ స్టడీ మెటీరియల్ అందిస్తామని, ప్రత్యేక క్లాసులు నిర్వహించి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులకు డీఈఓ శామ్యూల్ పాల్ సూచించారు. నందవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాలలను శనివారం పరిశీలించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించా రు. పాఠశాలల్లో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.63 కోట్లు మంజూరు చేసిందని, నిధులు విడుదల కావాల్సి ఉందన్నారు. పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుల కొరత ఉందని, సర్దుబాటు చేయాలని జెడ్పీ పాఠశాల హెచ్‌ఎం రామకృష్ణం రాజు, ఉపాధ్యాయులు డీఈఓకి వినతి పత్రం అందజేశారు.
రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్‌సైట్‌లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
రీకౌంటింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు సిటీ: ఈ ఏడాది ఆగస్టులో జరిగిన 2024–25 రెగ్యులర్ బ్యాచ్ డీఎడ్ 2వ సెమిస్టర్‌లో ఫెయిల్ అయిన వారు, అలాగే ఉత్తీర్ణత కాని 2022–24, 2023–25 బ్యాచ్‌కి చెంది వారు ఈ నెల 20వ తేదీలోపు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున సీఎఫ్‌ఎంఎస్ సిస్టం చలానా ద్వారా చెల్లించాలన్నారు.
మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు
కర్నూలు(అగ్రికల్చర్): మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరింత చొరవ తీసుకుంటామని పశుసంవర్ధక శాఖ కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వసంతలక్ష్మి తెలిపారు. బేతంచెర్ల ఏరియా వెటర్నరీ హాస్పిటల్స్ సహాయ సంచాలకులు(ఏడీ)గా పనిచేస్తున్న ఈమెకు ప్రభుత్వం డిప్యూటీ డైరెక్టర్(డీడీ)గా పదోన్నతి కల్పించింది. పదోన్నతిపై కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించిన నేపథ్యంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పోస్టు దాదాపు మూడు నెలలుగా ఖాళీగా ఉంది. వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన ఈమె వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌గా, సహాయ సంచాలకులుగా సుదీర్ఘకాలం జిల్లాలోనే పనిచేశారు. డీడీ కార్యాలయం సహాయ సంచాలకులు భవానిశంకర్‌రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
సివిల్స్‌కు ఉచిత శిక్షణ


