పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి
కర్నూలు (సెంట్రల్): జిల్లాలోని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.కబర్ధి ఆదేశించారు. కోర్టు సముదాయంలోని న్యాయ సదన్‌లో శనివారం జిల్లాస్థాయి న్యాయాధికారుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లాలోని అన్ని కోర్టుల జడ్జీలు, సీనియర్, జూనియర్ సివిల్ కోర్టుల జడ్జీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల నిర్వహణను పక్కాగా చేపట్టాలని సూచించారు. ఈపీ కేసులను ఆరు నెలల్లోపు పరిష్కరించేందుకు చేయాల్సిన సవరణలపై పలు సూచనలు ఇచ్చారు. కోర్టు భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కేసుల పరిష్కారంపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్జీలు పి.కమలాదేవి, పీజే సుధ, డి.అమ్మన రాజ, పి.వాసు, లక్ష్మీరాజ్యం, శ్రీవిద్య, ఎం.శోభారాణి, ఇ.రాజేంద్రబాబు, ఎంవీ హరినాథ్ పాల్గొన్నారు.
పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి


