ఆర్‌బీకేల్లో కనిపించని ఈ–క్రాప్ బుకింగ్ వివరాలు
కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఈ–క్రాప్ బుకింగ్ వివరాలను సోషల్ ఆడిట్‌కు పెట్టాలనే వ్యవసాయ శాఖ ఆదేశాలను కిందిస్థాయిలో పట్టించుకున్న దాఖలాలు లేవు. పంటల నమోదు వివరాలను ప్రింట్ తీసి ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు అన్ని రైతుభరోసా కేంద్రాల్లో రైతుల పరిశీలనకు ప్రదర్శించాల్సి ఉంది. వివరాలను రైతులు పరిశీలించి అభ్యంతరాలు ఉంటే అక్కడికక్కడే రాతపూర్వకంగా చెప్పవచ్చు. పంటల నమోదు వివరాలను ప్రింట్ తీసి రైతుల పరిశీలనకు పెట్టేందుకు ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో సగానికిపైగా ఆర్‌బీకే ఇన్‌చార్జీలు సోషల్ ఆడిట్‌ను పట్టించుకోనట్లు తెలుస్తోంది. అక్కడక్కడ ఆర్‌బీకే ఇన్‌చార్జీలు ఐదారుగురు రైతులను పిలిపించి ఫొటోలు తీసుకొని మమ అనిపించినట్లు సమాచారం.
డ్రంకెన్ డ్రైవ్‌లో మైనర్లు పట్టుబడితే వాహనం జప్తు
కర్నూలు: డ్రంకెన్ డ్రైవ్‌లో మైనర్లు పట్టుబడితే వాహనాలను జప్తు చేసి వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని యజమానులు, తల్లిదండ్రులకు సూచించారు. ఏదైనా జరగరాని ఘటన జరిగితే కుటుంబం జీవితాంతం బాధ పడాల్సి వస్తుందన్నారు. రోడ్డు ప్రమాదం ద్వారా పిల్లలను దూరం చేసుకోవడం కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు తీరని లోటు అన్నారు. ట్రాఫిక్ నిబంధనల గురించి జిల్లాలో పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయన్నారు. రహదారి ప్రమాదాలను అరికట్టి ప్రజలంతా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలనే సంకల్పంతో పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ రెండోసారి పట్టుబడితే రూ.5 వేల జరిమానా కూడా విధిస్తామని పేర్కొన్నారు.


