పరిశుభ్రమైన సమాజాన్ని నెలకొల్పుదాం
ఓర్వకల్లు: పరిశుభ్రమైన సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అన్నారు. శనివారం మండలంలోని నన్నూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు సీఈఓ నాసర రెడ్డి, డీపీఓ భాస్కర్, ఆర్‌డీఓ సందీప్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించాలి, నీటి వనరులను ఎలా కాపాడుకోవాలి అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మరుగుదొడ్లు నిర్మిస్తున్నా వాటిని కట్టెలు, కోళ్లు ఉంచడానికి ఉపయోగిస్తుండటం శోచనీయమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్డిని విధిగా నిర్మించుకోవడంతో పాటు వినియోగించుకోవాలన్నారు. ఇంటి బయట చెత్త పడేయకుండా ప్రతిరోజూ డోర్ టు డోర్ కలెక్షన్ కోసం వచ్చే సిబ్బందికి అందివ్వాలన్నారు. వలసలకు వెళ్లే సమయంలో పిల్లలను వారితో పాటు తీసుకెళ్లకుండా సీజనల్ హాస్టల్‌లో ఉంచితే వారి విద్యకు అంతరాయం కలుగకుండా సహకరించాలన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. విద్యార్థులతో కలసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నాగ అనసూయ, తహసీల్దార్ విద్యాసాగర్, డీఎల్‌డీఓ రమణారెడ్డి, సర్పంచు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


