ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
జూపాడుబంగ్లా: మండలంలోని పారుమంచాల గ్రామానికి చెందిన సతీష్ (23) గురువారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ఎస్‌ఐ మల్లికార్జున శుక్రవారం తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దేవరాజు కుమారు డు సతీష్ తిరుపతిలో బంధువుల వద్ద ఉంటూ పెయింటర్ పనిచేసేవాడు. మూడు రోజుల క్రితం ఇంటికి వచ్చిన సతీష్ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం పనులకు వెళ్లి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు.. తలుపు లోపలవైపు గడియపెట్టి ఉండటంతో ఎంతగా పిలిచినా తెరవలేదు. ఇంటి గవాక్షి ద్వారా లోపలికి వెళ్లి గడియ తీశారు. ఇంట్లోని ఫ్యాన్‌కు సతీష్ విగతజీవిగా వేలాడుతూ కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. తన కుమారుడు కడుపునొప్పితో బాధపడుతుండేవాడని, నొప్పి తాళలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి దేవరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మల్లికార్జున కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. మృతదేహానికి నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


