రబీలో ఆయకట్టుకు నీరు ఇవ్వలేం
● తుంగభద్ర ప్రాజెక్టు ఐఏసీ నిర్ణయం
కర్నూలు సిటీ: రబీలో తుంగభద్ర దిగువ కాలువ కింద ఆయకట్టుకు నీరు ఇవ్వలేమని తుంగభద్ర ప్రాజెక్టు నీటిపారుదల సలహా కమిటీ(ఐఏసీ) నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో శుక్రవారం నిర్వహించిన ఐఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. తుంగభద్ర డ్యాం 19వ క్రస్టు గేటు 2024 ఆగస్టు నెలలో కొట్టుకుపోగా, దాని స్థానంలో స్టాప్‌లాక్ గేటు ఏర్పాటు చేశారు. సీడబ్యూసీ, నేషనల్ డ్యాం సేఫ్టీ ఆథారిటీల చేసిన సూచనల మేరకు డ్యాం 33 గేట్లు మార్చాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. రైతులకు అవగహన కల్పించి గేట్ల మార్పునకు సహకరించేటట్లు ఒప్పించాలని సూచించారు. ప్రస్తుతం డ్యాంలో ఉన్న నీటిని ఇంకా ఎన్ని రోజులు అందించవచ్చో సమావేశంలో చర్చించారు. అందుబాటులో ఉన్న నీటిని సాగులో ఉన్న ఆయకట్టుకు దామాషా ప్రకారం అందించేందుకు షెడ్యుల్‌ను ప్రకటించారు.
జనవరి 10 వరకు ఖరీఫ్ పంటలకు నీరు
తుంగభద్ర జలాలపై రాయలసీమ జిల్లాల్లో ఎల్‌ఎల్‌సీ, హెచ్చెల్సీ, ఆలూరు బ్రాంచ్ కెనాల్, కేసీ కాలువల పరిధిలో 6.56 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో రబీ సీజన్‌లో 3.5 లక్షల ఎకరాల్లో ఆయకట్టు సాగు కావాలి. అయితే డ్యాం గేట్ల మార్పుతో సామర్థ్యాన్ని 80 టీఎంసీలకు తగ్గించారు. ప్రస్తుతం డ్యాంలో 75.96 టీఎంసీలకు నీటి నిల్వలు తగ్గాయి. దీంతో పాటు డ్యాం ఎగువ నుంచి ఇన్‌ఫ్లో నిలిచిపోయింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను చూస్తుంటే వర్షాలు వచ్చేటట్లు లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రబీకి నీరు ఇవ్వబోమని ఖరీఫ్ సీజన్‌కు ముందే బోర్డు ప్రకటించింది. మొన్నటిదాకా వర్షాలు కురుస్తుండడం డ్యాంలో నీటి నీటి నిల్వలు ఆశజనకంగా ఉండడంతో రబీ ఆయకట్టుకు కూడా నీరు ఇస్తారని ఆయకట్టు రైతులు అశలు పెంచుకున్నారు. డ్యాం గేట్ల మార్పు చేయాల్సి ఉండడం..ఇందుకు డ్యాంలో 1613 అడుగులకు నీటి నిల్వలు చేరితేనే కొత్త గేట్లకు అవకాశం ఉండడంతో రబీకి నీరు ఇవ్వలేమని ఐఏసీ తీర్మానం చేసింది. ఖరీఫ్‌లో కురిసిన వర్షాలతో కొంత మంది రైతులు దెబ్బతిన్న పంటలను తొలగించి పంటలు సాగు చేశారు. తుంగభద్ర దిగువ, ఎగువ కాలువల పరిధితో పాటు, టీబీ డ్యాల జలాలు అందించే కాల్వలకు నీటిని సాగుకు వచ్చే నెల 1 నుంచి జనవరి 10వ తేదీ వరకు నీటిని అందించాలని తీర్మానం చేశారు. తాగు నీటిని అవసరమైన సమయంలో వచ్చే ఏడాది మే 31వ తేదీ వరకు నీటిని అందించాలని నిర్ణయించారు.


