టీనేజ్ ప్రెగ్నెన్సీలు లేకుండా చర్యలు
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూల(సెంట్రల్): టీనేజ్ ప్రెగ్నెన్సీలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. ముఖ్యంగా 8, 9, 10వ తరగతి డ్రాప్ అవుట్ అయిన విద్యార్థినులు ఏమి చేస్తున్నారో చూడాలని డీఈఓలను ఆదేశించారు. అంతేగాక బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టరేట్ నుంచి వైద్య, ఆరోగ్య అంశాలపై మెడికల్ ఆఫీసర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మిగనూరులోని లక్ష్మణ్‌పేట, ఆదోనిలోని హనుమాన్‌నగర్, ఇందిరాగాంధీ నగర్ యూపీహెచ్‌సీల్లో హైరిస్కు ప్రెగ్నెన్సీలను గుర్తించడంలో వెనుకబడి ఉన్నట్లు చెప్పారు. సరైన సమయంలో గుర్తించకపోతే వైద్య సేవలు అందక ప్రసూతి, శిశు మరణాలకు దారి తీసే అవకాశం ఉంటుందన్నారు. హైరిస్కు ప్రెగ్నెన్సీలను గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణుల వివరాలు రిజిస్టర్ చేయడంలో కోసిగి, పెద్దతుంబళం, నందవరం ప్రాథమిక కేంద్రాల పనితీరు బాగుందని అభినందించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కర్‌రావు, డీసీహెచ్‌ఎస్ జఫ్రూల్లా, జీజీహెచ్ సూపరిటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చిట్టి నరసమ్మ పాల్గొన్నారు.


