తేలు కాటుకు విద్యార్థిని మృతి | - | Sakshi
Sakshi News home page

తేలు కాటుకు విద్యార్థిని మృతి

Nov 14 2025 8:23 AM | Updated on Nov 14 2025 8:23 AM

తేలు

తేలు కాటుకు విద్యార్థిని మృతి

తొగలుగల్లు సమీపంలో చిరుత సంచారం

ఎమ్మిగనూరురూరల్‌: మండల పరిధిలోని దైవందిన్నె గ్రామంలో పొలంలో తేలు కాటుకు గురై కురవ సరస్వతి(13) అనే విద్యార్థిని మృతి చెందింది. గ్రామానికి చెందిన కురవ శేఖర్‌, కురవ శకుంతలమ్మ కుమార్తె కె. సరస్వతి స్థానిక హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. బుధవారం తల్లిదండ్రులతో పాటు సాయంత్రం పత్తి పొలంలో పనిచేస్తుండగా తేలు కాటుకు గురైంది. ఇంటికి వచ్చాక గ్రామంలో నాటు వైద్యం చేయించటంతో నొప్పి తగ్గి రాత్రి మరలా ఎక్కువ కావటంతో గురువారం ఉదయం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో కోలుకోలేక మృతి చెందింది. బాలిక మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు.

గుండెపోటుతో జీవితఖైదీ మృతి

కోవెలకుంట్ల: భీమునిపాడుకు చెందిన మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ ఆరికట్ల సుంకిరెడ్డి(73) గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హత్యకేసులో 2022వ సంవత్సరంలో జీవితఖైదీ పడింది. అప్పటి నుంచి కడప సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. గురువారం ఉదయం గుండెపోటు రావడంతో జైలు సిబ్బంది చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ఽధ్రువీకరించారు. ఈ మేరకు మృతదేహాన్ని రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు.

భార్య కాపురానికి రాలేదని భర్త అదృశ్యం

కర్నూలు: భార్య దీణరాణి కాపురానికి రాకుండా ఉందని మనస్తాపానికి గురైన భర్త సుంకన్న అలియాస్‌ రాజు (39) అదృశ్యమయ్యాడు. ఈయన కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. శిరివెళ్ల మండలం మాదేపురం గ్రామానికి చెందిన దీణరాణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. చిన్న గొడవ కారణంగా భార్య పుట్టింటికి వెళ్లి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా తిరిగి సంసారానికి రాకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీ జరిగింది. అయినా ఆమె కాపురానికి రాకపోవడంతో సుంకన్న మనస్తాపానికి గురై ఈనెల 1వ తేదీన పిల్లలను చూడటానికి భార్య దగ్గరకు వెళ్తున్నట్లు చెప్పి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి సాగర్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినవారు 95029 81868 లేదా 7989690812 నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని తండ్రి సాగర్‌ కోరారు.

ముచ్చట్లలో వ్యక్తి మృతి

బేతంచెర్ల: ముచ్చట్ల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ కోనేరు సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల మేరకు.. ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామానికి చెందిన కుమ్మరి మనోహర్‌(45) కొంత కాలంగా నాపరాయి ట్రేడింగ్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అప్పుడప్పుడు ముచ్చట్ల క్షేత్రానికి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకునేవాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇక్కడికి చేరుకున్న మనోహర్‌ ఆలయ కోనేరులో స్నానం చేస్తుండటంతో ఆయాసం వచ్చింది. భయంతో ఒడ్డుకు వచ్చి మెట్లపైనే కుప్పకూలి పోయి మృతి చెందాడు. పక్కనే ఉన్న మరో భక్తుడు గమనించి ఆలయ పూజారికి తెలపడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బేతంచెర్ల ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య నాగలక్ష్మితోపాటు కుమారులు మణికంఠ, మురళీ ఉన్నారు.

ఆస్పరి: చిరుత పులి దాడిలో ఆవు దూడ మృతి చెందడంతో తొగలగల్లు గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పంట పొలాలకు వెళ్లలేకపోతున్నారు. గ్రామ సమీపంలోని కొండ పక్కన అహోబిలం అనే రైతు బోరు కింద పంటలను సాగు చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ప్రతి రోజులాగే బుధవారం సాయంత్రం పశువులను ఆరుబయట కట్టేశాడు. రాత్రి సమయంలో కట్టేసిన ఆవు దూడపై చిరుత దాడి చేసింది. గురువారం తెల్లవారుజామున రైతు చూస్తే ఆవు దూడ కన్పించకపోవడంతో వెతకగా కొద్ది దూరంలో ఆవు దూడ కళేబరం కన్పించింది. ఆవు దూడపై చిరుతే దాడి చేసిందని రైతు తెలిపారు. రెండు సంవత్సరాలు నుంచి చిరుత పులి ఇక్కడే కొండల్లో సంచరిస్తుందని స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించాలని అహోబిలం అనే రైతుకు పరిహారం ఇవ్వాలని తొగలుగల్లు గ్రామస్తులు కోరుతున్నారు.

తేలు కాటుకు విద్యార్థిని మృతి 1
1/3

తేలు కాటుకు విద్యార్థిని మృతి

తేలు కాటుకు విద్యార్థిని మృతి 2
2/3

తేలు కాటుకు విద్యార్థిని మృతి

తేలు కాటుకు విద్యార్థిని మృతి 3
3/3

తేలు కాటుకు విద్యార్థిని మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement