ప్రతిభను ప్రోత్సహించేలా..!
● ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు
ఈఈఎంటీ పరీక్ష
● రిజిస్ట్రేషన్‌కు ఈనెల 14న తుది గడువు
● విజేతలకు నగదు బహుమతులు
నంద్యాల(న్యూటౌన్): విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను వెలికి తీసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎడ్యుకేషనల్ ఎపీఫనీ అనే సంస్థ 2025–26 విద్యా సంవత్సరానికి మెరిట్ టెస్టు (ఈఈఎంటీ) నిర్వహించనుంది. ప్రభుత్వ పాఠశాలలోని 7, 10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనుంది. ఈఈఎంటీ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్ రెండు దశల్లో నిర్వహిస్తారు. డిసెంబర్ 6న ప్రిలిమినరీ పరీక్ష, 7న ఫలితాలు విడుదల చేస్తారు. ఇంటి వద్ద నుంచి లేదా పాఠశాల నుంచి పరీక్షకు హాజరు కావచ్చు. మెయిన్ పరీక్షకు డిసెంబరు 8 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష డిసెంబరు 27న నిర్వహిస్తారు. జిల్లాకు ఒక పరీక్ష కేంద్రం ఉండగా, అభ్యర్థి ఎంచుకున్న కేంద్రంలో పరీక్ష రాయాలి. పరీక్షలో 50 శాతం మార్కులు పొంది ఆన్‌లైన్ నిబంధనలు కచ్చితంగా పాటించిన వారికి బహుమతులు అందజేస్తారు. పరీక్షను మొబైల్/ల్యాప్‌టాప్/ట్యాబ్/ కంప్యూటర్ వీటిలో ఏదైనా ఒక దానిని ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ రాసే వారికి నవంబరు 29న మాక్ టెస్ట్, మెయిన్స్ పరీక్షకు డిసెంబరు 20న టెస్ట్ రాసే అవకాశం కల్పిస్తారు. హెచ్‌టీటీపీఎస్–ఎడ్యుకేషనల్ ఎపిఫనీ.ఓఆర్జీ–ఈఈ ఎంటీ2026/రిజిస్ట్రేషన్, పీహెచ్‌పీ లింక్ ద్వారా ఈనెల 14వ తేదీ లోపు దరఖాసు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈఈఎంటీ పరీక్ష అని, అధిక శాతం విద్యార్థులు హాజరయ్యేలా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. దరఖాస్తుకు ఎటువంటి రుసుం లేదన్నారు.
బహుమతులు ఇలా..
ఈ పోటీ పరీక్షల్లో 162 మంది విజేతలకు దాదాపుగా రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు అందించనున్నారు. రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు, తృతీయ బహుమతిగా రూ.20వేలు, 7వ తరగతితో రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తతీయ స్థానాల్లో నిలిచిన వారికి అందజేస్తారు. జిల్లా స్థాయిలో 10వ తరగతిలో రూ.8వేలు, రూ.8వేలు, రూ.4వేలు, 7వ తరగతి విద్యార్థులకు రూ.5 వేలు,రూ.4వేలు, రూ.3వేలు వరుసగా మూడు స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులుగా ఇస్తారు. మండల స్థాయిలో 10, 7 తరగతుల్లో ప్రథమ స్థానం పొందిన వారికి జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి ప్రశంసా పత్రాన్ని మాత్రమే ఇస్తారు. మరింత సమాచారం తెలుసుకునేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలి.
ప్రతిభను ప్రోత్సహించేలా..!


