రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య
కర్నూలు(సెంట్రల్): ఉల్లి, టమాటా, పత్తి రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య విమర్శించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పత్తిని కూడా క్వింటాల్ రూ.12 వేల ప్రకారం సీసీఐ ద్వారా కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. కర్నూలులో ఏర్పాటు చేసిన జిల్లా సమితి సమావేశంలో గురువా రం ఆయన మాట్లాడారు. అధికారంలో లేని సమయంలో మాత్రమే గుండ్రేవుల, వేదావతి, ఆర్‌డీఎస్ కుడి కాలువల ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడికి గుర్తుకు వస్తాయన్నారు. అధికారంలోకి వస్తే మాత్రం పట్టించుకోరని విమర్శించారు. కులగణన జరిగిన తరువాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి అయిన తరువాత తొలిసారి కర్నూలు వచ్చిన ఆయనకు పార్టీ నాయకులు పూలమాలలు, శాలువాలు వేసి సన్మానించారు. సీపీఐ నాయకులు రామచంద్రయ్య, గిడ్డయ్య, జగన్నాథం, మునెప్ప, లెనిన్‌బాబు, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


