కౌతాళం ఎంపీడీఓకు డీఎల్‌డీఓగా పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని కౌతాళం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తున్న పి.రాజేంద్రప్రసాద్‌కు డీఎల్‌డీఓగా పదోన్నతి లభించింది. ఈ మేరకు పీఆర్ అండ్ ఆర్‌డీ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పదోన్నతి పొందిన ఆయనను గుంటూరు డ్వామా ఏపీఓ ( ఎంఅండ్‌ఈ )గా నియమించారు.
ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ రద్దు
కర్నూలు(సెంట్రల్): జిల్లా న్యాయ సేవాధికార సంస్థలోని మీడియా సెంటర్‌లో ఖాళీగా ఉన్న స్టెనో, టైపిస్టు కమ్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేసినట్లు ఆ సంస్థ జిల్లా కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని కోరారు.
పంటల నమోదుపై నేటి నుంచి సామాజిక తనిఖీలు
కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబందించి పంటల నమోదు వివరాలను ఈ నెల 14 నుంచి సోషల్ ఆడిట్‌కు పెట్టనున్నారు. అభ్యంతరాలను రాతపూర్వకంగా తెలియజేసేందుకు నేటి నుంచి 17వ తేదీ వరకు జాబితాలను ఆర్‌ఎస్‌కేల్లో పెట్టాలని వ్యవసాయ శాఖ ఆదేశించింది. అయితే ప్రింట్ తీసేందుకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో ఆర్‌బీకే ఇన్‌చార్జీలకు ఖర్చు తడసి మోపెడుకానుంది. భూమి విస్తీర్ణం, పంటల వివరాలు, విత్తనం రకాలు తదితర వివరాలను పరిశీలించుకొని తేడాలు ఉంటే సరిచేసుకోవాలనేది లక్ష్యం. పంటల నమోదు వివరాలు సరిగ్గా ఉంటే భవిష్యత్‌లో ఉత్పన్నమయ్యే సమస్యలను అధిగమించవచ్చు. అయితే ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో పంటల నమోదు వివరాలు ప్రింటు తీసి సోషల్ ఆడిట్‌కు పెడుతారా? లేదా? అనేది ప్రశ్నార్థకమైంది.
ఎస్‌ఏ–1 పరీక్ష వాయిదా
కర్నూలు సిటీ: బాలల దినోత్సవం సందర్భంగా నేడు(శుక్రవారం)జరగాల్సిన ఎస్‌ఏ–1 పరీక్షను వాయిదా వేశారు. వాయిదా వేసిన పరీక్షను 1వ తరగతి నుంచి 5తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 17వ తేదీన, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 20వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పరీక్ష పత్రాలను సురక్షితంగా భద్ర పరచాలని, ఎట్టి పరిస్థితుల్లోను తెరవకూడదని పాఠశాల విద్య కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
25 లోపు ‘పది’ పరీక్షల ఫీజు చెల్లించాలి
కర్నూలు సిటీ: పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల ఫీజు ఈ నెల 25వ తేదీలోపు చెల్లించాలని డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గడువులోపు ఫీజు చెల్లించాలని, రూ.50 రుసుంతో వచ్చే నెల 3వ తేదీ వరకు, రూ.200 రుసుంతో వచ్చే నెల 10వ తేదీ, రూ.500 రుసుంతో డిసెంబరు 15వ తేదీలో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ తేదీల్లో సాధారణ సెలవులు ఏవైనా ఉన్నట్లు అయితే ఆ మరుసటి రోజు కూడా చెల్లించవచ్చునని తెలిపారు. పూర్తి వివరాలకు www.bseap.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.
అనాథ శిశువుల కోసం ఊయల
కర్నూలు(అర్బన్): అనాథ శిశువుల సంరక్షణ కోసం ఊయలను ఏర్పాటు చేశామని జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారిణి పీ విజయ తెలిపారు. కర్నూలు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఊయలను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎవరైనా తమ వ్యక్తిగత సమస్యలతో శిశువులను ముళ్లపొదలు, చెత్తకుప్పల్లో పారవేయకుండా సురక్షితమైన ప్రదేశాల్లో వదలాలన్నారు. ఎక్కడపడితే అక్కడ శిశువులను వదిలి వేయడం వల్ల శిశువులు ప్రమాదాలకు గురై పలు సందర్భాల్లో మృతి చెందే అవకాశాలు ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలోనే రైల్వే స్టేషన్ ప్రాంగణంలో శిశువుల సంరక్షణ కోసం ఊయలను ఏర్పాటు చేశామన్నారు. బాలల పరిరక్షణ అధికారిణి టీ శారద, రైల్వే సీనియర్ డీఎంఓ జీ విజయకుమార్, ఏఎస్‌ఐ కే ప్రకాష్, ఎస్‌ఏఏ మేనేజర్ మోహతాజ్ బేగం, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.


