శ్రీశైలంలో నేడు కోటి దీపోత్సవం
శ్రీశైలంటెంపుల్: కార్తీకమాసోత్సవాల సందర్భంగా నాల్గవ శుక్రవారం శ్రీశైల దేవస్థానం కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందుకోసం దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కోటి దీపోత్సవం ఏర్పాట్లను గురువారం శ్రీశైల దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆలయం ముందుభాగంలోని గంగాధర మండపం వద్ద సాయంత్రం 6 గంటల నుంచి కోటి దీపోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కైలాస పర్వతం సెట్టింగ్ భక్తులను ఆకట్టుకుంటోంది. ఉత్సవంలో పాల్గొనే భక్తులకు అవసరమైన పూజాద్రవ్యాలన్నింటిని దేవస్థానమే సమకూర్చనుంది. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ వారిచే శ్రీశైలక్షేత్రం–కోటిదీపోత్సవం అనే అంశంపై ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు. పరమేశ్వరునికి దివ్యజ్యోతిని సమర్పించడం వలన సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించాల్సిసినదిగా దేవస్థాన అధికారులు కోరుతున్నారు.


