స్నాతకోత్సవ సంబరం
ఆర్‌యూలో ఘనంగా నాల్గవ కాన్వొకేషన్ వేడుకలు
చాన్స్‌లర్ హోదాలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్
తల్లిదండ్రులు, గురువులు గర్వపడేలా యువత ఎదగాలన్న గవర్నర్
ఎ.ఎం. గ్రీన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డాక్టర్ ఎస్‌ఎస్‌వీ రామకుమార్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం
20 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ నాల్గవ కాన్వొకేషన్ వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం వర్సిటీ ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి చాన్స్‌లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి పాల్గొన్నారు. ఎ.ఎం.గ్రీన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డాక్టర్ ఎస్.ఎస్.వి.రామకుమార్‌కు వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను గవర్నర్ ప్రదానం చేశారు. పీజీ, ఇంజినీరింగ్ విద్యలో ప్రతిభ కనబరిచి టాపర్స్‌గా నిలిచిన 20 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్‌ను అందజేశారు. గవర్నర్ కాన్వొకేషన్ సందేశాన్నిచ్చారు. అనంతరం గౌరవ డాక్టరేట్ అందుకున్న డాక్టర్ ఎస్‌ఎస్‌వీ రామకుమార్ స్నాతకోత్సవ ఉపన్యాసం చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాలతోపాటు విద్యుత్ రంగంలో తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా తనను గౌరవించిన రాయలసీమ యూనివర్సిటీకి ధన్యవాదాలు తెలిపారు. స్టార్టప్స్ రంగంలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. దేశ ప్రగతి రథానికి విద్యార్థులు అంతా చోదక శక్తిగా మారాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు వర్సిటీ ౖవైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు వర్సిటీ ప్రగతి నివేదికను వివరించారు. వర్సిటీలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, కోర్సులు, జరుగుతున్న పరిశోధనలను తెలియజేశారు. విద్యార్థులచేత ప్రతిజ్ఙ చేయించారు. అనంతరం ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ మధుమూర్తి, వీసీ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు, గౌరవ డాక్టరేట్ గ్రహీత డాక్టర్ రామకుమార్ 55 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 283 మంది పరిశోధకులకు పీహెచ్‌డీ పట్టాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, వర్సిటీ రెక్టార్ ప్రొఫెస్ ఎన్‌టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బీవీ జయకుమార్‌నాయుడు, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీవీ కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు, వివిధ విభాగాల డీన్‌లు ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డి, ప్రొఫెసర్ సుందరానంద్, ప్రొఫెసర్ భరత్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, వర్సిటీ పాలక మండలి సభ్యులు డాక్టర్ సునిత, డాక్టర్ శైలజ, ఉర్దూ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ షావలి ఖాన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లోకనాథ, తదితరులు పాల్గొన్నారు.
అందరూ గర్వపడేలా యువత ఎదగాలి..
చాన్స్‌లర్ హోదాలో మొదటి సారి వర్సిటీకి రావడం సంతోషంగా ఉందని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. ఉన్నతంగా తీర్చిదిద్దిన విద్యా సంస్థ, సమాజానికి రుణం తీర్చుకోడం అందరి ప్రాథమిక కర్తవ్యం, బాధ్యత అన్నారు. తల్లిదండ్రులు, గురువులు గర్వపడేలా యువత ఎదగాలన్నారు. వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి డిగ్రీ పట్టాలు స్వీకరిస్తున్న విద్యార్థులంతా ఎంచుకున్న రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. వర్సిటీ నాణ్యమైన బోధన, పరిశోధనల ద్వారా విద్యార్థుల భవితకు బాటలు వేయడం సంతోషకరమన్నారు. డిగ్రీలు సంపాదించుకున్న విద్యార్థులు జ్ఞానంతో సార్థకమైన జీవితాన్ని గడపాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలో విద్యార్థులు తమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకున్నప్పుడు భవితకు డోకా ఉండదన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తి అయ్యే 2047 నాటికి దేశాన్ని ప్రగతి పథంలో నిలపాలన్న దేశ ప్రధాని మోదీ ఆశయాలకు నూతన విద్యా విధానం తోడ్పాటు అందిస్తుందన్నారు.
స్నాతకోత్సవ సంబరం


