పది ఇసుక ట్రాకర్ల పట్టివేత
కౌతాళం: ఎలాంటి వే బిల్లులు, అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న పది ట్రాక్టర్లను బుధవారం ఏరిగేరి గ్రామం వద్ద పట్టుకున్నట్లు తహసీల్దారు రజనీకాంత్‌రెడ్డి తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం ఉండటంతో మూడు రీచ్‌లను తాత్కలికంగా బంద్ చేయించామన్నారు. కొంత మంది ఎలాంటి రశీదులు లేకుండా అనుమతులు తీసుకోకుండా కుంబళనూరు వద్ద ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేసి ట్రాక్టర్లను పట్టుకున్నామన్నారు. ఇసుక ఉచితంగా ఉన్న కొంతమంది ఇసుక వ్యాపారం చేసుకోవడానికి అక్రమ ఇసుక రవాణాకు తెరలేపారన్నారు. పట్టుకున్న ట్రాక్టర్లకు మైనింగ్ అధికారుల సూచనల మేరకు జరిమానా విధిస్తామన్నారు.


