రానున్న రోజుల్లో పెరగనున్న చలి తీవ్రత
కర్నూలు(అగ్రికల్చర్): రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లాలో పొడి వాతావరణం ఉంటుందని, ఎలాంటి వర్షసూచన లేదని వ్యవసాయ వాతావరణ విభాగం ప్రధాన శాస్త్రవేత్త జి.నారాయణ స్వామి తెలిపారు. ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయి. ఇందువల్ల ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 32.2 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 18.5 నుంచి 20 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉదయం పూట గాలిలో తేమ 74–80 శాతం వరకు ఉండటం వల్ల చలి ప్రభావం ఎక్కువగా ఉండవచ్చన్నారు.
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్ట్ నీటిని మంగళవారం తెల్లవారుజామున హంద్రీనదికి విడుదల చేశారు. ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడంతో ముందు జాగ్రత్తగా నాలుగో క్రస్ట్ గేటు ఎత్తి 330 క్యూసెక్కుల నీటిని హంద్రీనదిలోకి విడుదల చేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అలాగే ఎల్లెల్సీ నుంచి 50 క్యూసెక్కుల నీరు జీడీపీలోకి వస్తోందన్నారు.
270 టన్నుల సమీకృత దాణా కేటాయింపు
కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖ పాడిపశువుల కోసం సమీకృత దాణా సరఫరా చేస్తోందని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ హేమంత్‌కుమార్ తెలిపారు. జిల్లాకు 270 టన్నుల దాణాను కేటాయించారని, రైతులకు 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు మంగళవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 50 కిలోల బస్తా పూర్తి ధర రూ.1,110 ఉండగా.. ఇందులో రూ.555 సబ్సిడీ వర్తిస్తుందన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ఒక్కో రైతుకు గరిష్టంగా మూడు బస్తాల ప్రకారం పంపిణీ చేస్తామన్నారు.
కర్నూలు డివిజన్ డీడీగా వసంతలక్ష్మి
కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖ కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్‌గా డాక్టర్ పి.వసంతలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.నంద్యాల జిల్లా బేతంచెర్ల ఏరియా వెటర్నరీ హాస్పిటల్ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న ఈమెకు డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఈమెను ఖాళీగా ఉన్న కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ పోస్టులో నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
● వెలుగోడు ఏరియా వెటర్నరీ హాస్పిటల్ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న డాక్టర్ ఏ.వెంకటేశ్వర్లు పదోన్నతిపై కడప డివిజన్ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
రానున్న రోజుల్లో పెరగనున్న చలి తీవ్రత


