స్నాతకోత్సవానికి వేళాయే!
నేడు రాయలసీమ యూనివర్సిటీ నాల్గవ కాన్వొకేషన్
చాన్స్‌లర్ హోదాలో మొదటిసారి ఆర్‌యూకు హాజరు కానున్న గవర్నర్
గౌరవ డాక్టరేట్ అందుకోనున్న ఎ.ఎం. గ్రీన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డాక్టర్ ఎస్.ఎస్.వి.రామకుమార్
75 మందికి గోల్డ్‌మెడల్స్, 283 మందికి పీహెచ్‌డీ అవార్డులను ప్రదానం చేయనున్న వర్సిటీ
ఏర్పాట్లు పూర్తి చేశాం
కర్నూలు కల్చరల్: పట్ట భద్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్నాతకోత్సవ (పట్టాల) పండుగ రానే వచ్చింది. కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ నాల్గవ కాన్వొకేషన్ వేడుకలు బుధవారం వర్సిటీలో జరగనున్నాయి. వీటి నిర్వహణకు వర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాయలసీమ యూనివర్సిటీ ఏర్పాటు అయ్యాక ప్రస్తుతం జరుగుతున్న ఈ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చాన్స్‌లర్ హోదాలో మొదటి సారి వర్సిటీకి రానుండటం విశేషం. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఎ.ఎం. గ్రీన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్.ఎస్.వి. రామకుమార్‌కు వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనుంది. ఆయనే ప్రధాన వక్తగా ఉపన్యసించనున్నారు.
గవర్నర్ పర్యటన ఇలా..
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చాన్స్‌లర్ హోదాలో ఆర్‌యూ నాల్గవ స్నాతకోత్సవం, మాంటిస్సోరి పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు కర్నూలు రానున్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి కర్నూలులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 10.50 గంటలకు రోడ్డు మార్గాన రాయలసీమ యూనివర్సిటీకి చేరుకుంటారు. 11 నుంచి 12.15 గంటల వరకు వర్సిటీ నాల్గవ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.35 గంటలకు మాంటిస్సోరి ఇండస్ రెసిడెన్షియల్ స్కూల్‌కు చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం, విశ్రాంతి తీసుకొని 2.20 గంటలకు బయలు దేరి 2.30 గంటలకు ఏక్యాంప్ మాంటిస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్‌కు చేరుకు ని స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో 3.30 గంటల వరకు పాల్గొంటారు. సాయంత్రం 4.10 గంటలకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టు చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరుతారు. గవర్నర్ పరట్యన నేపథ్యంలో ప్రొటోకాల్ అధికారులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏయిర్‌పోర్ట్ నుంచి ఆర్‌యూ వరకు ట్రయల్ రన్ నిర్వహించి, సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించారు.
ముస్తాబైన వర్సిటీ
వర్సిటీ నాల్గవ కాన్వొకేషన్‌కు ముస్తాబైంది. పరిపాలనా భవనం, అకడమిక్ బిల్డింగ్స్, వర్సిటీ ముఖ ద్వారాలు, వర్సిటీ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించి పెయింటింగ్ వేయించి సుందరంగా తీర్చిదిద్దారు. పరిపాలనా భవనాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. కాన్వొకేషన్ జరిగే వేదికను అందంగా తీర్చిదిద్దారు.
75 మందికి బంగారు పతకాలు
వర్సిటీలో 60 మంది పీజీ, 15 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు కలిపి మొత్తం 75 మందికి బంగారు పతకాలను గవర్నర్ అందజేయనున్నారు. 283 మంది స్కాలర్స్‌కు పీహెచ్‌డీ కాన్వొకేషన్‌కు దరఖాస్తు చేసుకోగా ఇన్‌పర్సన్ 138 మంది, పీజీ విద్యార్థులు 889 మంది దరఖాస్తు చేసుకోగా ఇన్‌పర్సన్‌గా 256 మంది విద్యార్థులు నేరుగా కాన్వొకేషన్ పట్టాను అందుకోనున్నారు. 2024–25 విద్యా సంవత్సరం వరకు డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులకు 17,224 మంది దరఖాస్తు చేసుకోగా అన్ని కోర్సులకు సంబంధించి మొత్తం 18,396 మంది విద్యార్థులు కాన్వొకేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
వర్సిటీ నాల్గవ కాన్వొకేషన్‌కు వర్సిటీ ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొత్తం 2,000 మంది పాల్గొనేలా సభా ప్రాంగణం ముస్తాబైంది. కాన్వొకేషన్‌కు హాజరయ్యే వారు ఉదయం 10 గంటల్లోగా వేదిక ప్రాంగణానికి చేరుకోవాలి. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, వర్సిటీ అనుబంధ కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లను ఆహ్వానించాం. చాన్స్‌లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ వర్సిటీకి రానున్నారు. వీసీగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే స్నాతకోత్సవం నిర్వహించడం సంతోషంగా ఉంది.
– ప్రొఫెసర్ వి.వెంకట బసరావు,
వైస్‌చాన్స్‌లర్, ఆర్‌యూ
స్నాతకోత్సవానికి వేళాయే!


