బరితెగించిన ఇసుకాసురులు
గోరంట్లలో రెచ్చిపోతున్న తమ్ముళ్లు
● హంద్రీ నుంచి రోజుకు 50 పైగా ట్రాక్టర్ల ఇసుక తరలింపు ● సోషల్ మీడియాలో వీడియోల హల్‌చల్
సాక్షి టాస్క్‌ఫోర్స్: కోడుమూరు మండలం గోరంట్ల గ్రామ హంద్రీనదిలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. హంద్రీనది నుంచి ఇసుకను యథేచ్ఛగా తోడేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కేడీసీసీబీ చైర్మన్ ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి అనుచరులు పగలు, రాత్రి తేడా లేకుండా గోరంట్ల హంద్రీ నది నుంచి రోజుకు 50కు పైగా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి చుట్టుపక్క గ్రామాలతో పాటు, క్రిష్ణగిరి, డోన్, పత్తికొండ వంటి ప్రాంతాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. ఇటీవలే హంద్రీనదికి వరదలు రావడంతో గోరంట్ల హంద్రీలో భారీగా ఇసుక మేటలు వేసింది. దీన్ని అదనుగా భావించిన విష్ణు అనుచరులు గోరంట్ల హంద్రీ నుంచి పట్టపగలే ఇతర ప్రాంతాలకు భారీగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరో 10నుంచి 15రోజుల్లో హంద్రీలో ఇసుకంతా ఖాళీ అయ్యే ప్రమాదముందని గ్రామస్తులు వాపోతున్నారు.
పగిలిపోతున్న మంచినీటి పైపులైన్లు
హంద్రీ నుంచి ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తుండటంతో గ్రామానికి మంచినీటి సరఫరా కోసం హంద్రీలో వేసిన పైపులైన్లు పగిలిపోతున్నాయి. దీంతో గోరంట్ల గ్రామంలో రెండు, మూడు రోజులకోసారి మంచినీటి సమస్య తలెత్తుతోంది. ఇసుక తరలింపు వల్లే పైపులైన్లు పగిలిపోతున్నాయని, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలంటూ పోలీసు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోతోందని ప్రజలు వాపోతున్నారు. నిత్యం పైపులైన్లు పగులుతుండడంతో పంచాయతీకి భారీగా నష్టం చేకూరుతోంది.
సోషల్ మీడియోలో పోస్టులు పెట్టి మరీ తరలింపు
అనుమతి లేకుండా హంద్రీనది నుంచి ఇసుకను తరలించరాదనే నిబంధనలున్నా గోరంట్లకు చెందిన విష్ణు అనుచరులు బేఖాతర్ చేస్తున్నారు. ప్రజల అవసరాలు, డిమాండ్‌ను బట్టి ఒక్కో ఇసుక ట్రాక్టర్ రూ.3వేల నుంచి రూ.4వేల వరకు పలుకుతుండడంతో తెలుగుతమ్ముళ్లు భారీగా దోచేస్తున్నారు. ఇక్కడి ఇసుక మాఫియా ఒక అడుగు ముందుకేసి హంద్రీనది నుంచి ఇసుకను ట్రాక్టర్లతో తరలించే వీడియోలను సైతం సోషల్ మీడియాలో పెడుతూ హల్‌చల్ చేస్తున్నారు. బహిరంగంగానే పోస్టులు పెడుతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తుండటం గమనార్హం.
బరితెగించిన ఇసుకాసురులు


