ప్రజల అభ్యున్నతికి సహకారం
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజల అభ్యున్నతికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) సహకరిస్తుందని కర్నూలు రీజినల్ హెడ్ నరసింహారావు తెలిపారు. స్థానిక హోటల్ మౌర్యాఇన్‌లో మంగళవారం యూబీఐ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని బ్రాంచ్‌ల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముంబయి నుంచి యూబీఐ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అషిష్ పాండే ప్రసంగంలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక వివరాలను లైవ్‌టెలీకాస్ట్ ద్వారా వీక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
హంద్రీ నదిలో
గుర్తుతెలియని వ్యక్తి మృతి
కర్నూలు: జొహరాపురం శివారులోని హంద్రీ నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. మంగళవారం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. సుమారు 45 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి క్రీమ్ కలర్ ఫుల్ షర్ట్, లేత నీలి రంగు ప్యాంటు ధరించాడు. మృతదేహం ఉబ్బిపోయి గుర్తు పట్టని విధంగా ఉంది. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు. ఆచూకీ తెలిసినవారు 9121101059 లేదా 9985726737, ల్యాండ్ నెంబర్ 08518–240012కు ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఐటీసీ మార్కెటింగ్
ఏజెంట్ ఆత్మహత్య
కర్నూలు: మండల పరిధిలోని ఉల్చాల గ్రామానికి చెందిన రఘువరన్ (23) పురుగు మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఈయన కర్నూలులోని ఐటీసీలో మార్కెటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఐటీసీ కంపెనీకి సంబంధించిన లోన్ కలెక్షన్ డబ్బు కంపెనీకి చెల్లించకుండా వాడుకున్నాడు. దీంతో కొంతకాలంగా కంపెనీ నిర్వాహకులు తీవ్ర ఒత్తిడి చేయడంతో వాడుకున్న డబ్బు చెల్లించే మార్గం లేక మనస్తాపానికి గురై సోమవారం ఇంటి వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడివుండగా కుటుంబ సభ్యులు కనుగొని ఆసుపత్రిలో చేర్పించి వైద్యచికిత్సలు చేయించారు. కోలుకోలేక తెల్లవారుజామున మృతిచెందాడు. కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యాపారవేత్త అరెస్ట్
● రిమాండ్ తిరస్కరించిన కోర్టు
నంద్యాల: వ్యాపారవేత్తను త్రీటౌన్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. సరైన విచారణ విధానం పాటించకుండా అరెస్ట్ చూపడంతో జడ్జి రిమాండ్ తిరస్కరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాలకు చెందిన వ్యాపారవేత్త బొగ్గరపు నాగరాజు బెంగళూరుకు చెందిన మనూ అనే వ్యక్తికి స్థిరాస్థి వ్యాపార లావాదేవీల్లో మోసం చేశారని, త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నాగరాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అరెస్ట్ సమయంలో పోలీసు అధికారులు చట్టం ప్రకారం నోటీసు ఇవ్వకపోవడం, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం, చట్టపరమైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని జడ్జికి వివరించడంతో రిమాండ్‌ను తిరస్కరించినట్లు న్యాయవాది నిఖిలేశ్వర్‌రెడ్డి తెలిపారు.


