వంద శాతం ఫలితాలు సాధించకుంటే నో రెన్యూవల్
కర్నూలు సిటీ: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా ల్లో తమతమ సబ్జెక్ట్‌ల్లో వంద శాతం ఫలితాలు సాధించకపోతే వచ్చే ఏడాదికి రెన్యూవల్ ఉండదని కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీని కేజీబీవీ స్కూళ్ల డైరెక్టర్ దేవానందరెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లాలోని 26 కేజీబీవీ ప్రిన్సిపాళ్లతో వర్చువల్ స్టూడియోలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో ఎప్పు డూ లేని విధంగా జూలై 15 నుంచే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు విజయపథం కార్యక్రమాన్ని ప్రారంభించామని, దాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రిన్సిపాళ్లపై ఉందని ఆయన తెలిపారు. సమావేశంలో డీఈఓ, సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ ఎస్.శామ్యూల్ పాల్, జీసీడీఓ స్నేహలత పాల్గొన్నారు.
డైరెక్టర్ దృష్టికి సమస్యలు..
నాన్ టీచింగ్ స్టాఫ్ పని చేయమంటే గొడవలకు దిగుతున్నారని, స్థానికంగా ఉండేవారు కావడంతో వారి కుటుంబ సభ్యులు వచ్చి తాము ఫలానా పార్టీ నాయ కులమంటూ పరోక్షంగా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్నారని పలువురు ప్రిన్సిపాళ్లు డైరెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
● కొన్ని కేజీబీవీల్లో రాత్రిళ్లు కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నామని ఇన్వర్టర్లు మంజూరు చేయాలని కో రారు.
● నాడు–నేడు పనులు నిలిచిపోవడంతో తరగతి గదులు చాలక, డ్రైనేజీ సిస్టం సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
●ఇంటర్ పిల్లలకు ల్యాబ్‌లు నిర్మిస్తున్నా పూర్తి కాలేదని, పరికరాలు పూర్తిగా అందజేయలేదని డైరెక్టర్‌కు వివరించారు.


