చిన్నారుల అస్వస్థతపై విచారణ
ఆదోని రూరల్: మండల పరిధిలోని నాగులాపురం గ్రామ అంగన్‌వాడీ కేంద్రం–2లో పది మంది చిన్నారులు అస్వస్థతకు గురైన విషయంపై అధికారులు విచారణ చేపట్టారు. ఐసీడీఎస్ పీడీ విజయ, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ సత్యవతి మంగళవారం అంగన్‌వాడీ కేంద్రం–2ను పరిశీలించారు. అంగన్‌వాడీ కార్యకర్తను, ఆయాను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కర్నూలు నుంచి వచ్చిన స్పెషల్ వాటర్ టెస్టింగ్ టీం తాగునీటిని సేకరించి ల్యాబ్‌కు తరలించింది. గడ్డ కట్టిన పాలు ఇవ్వడం, భోజనం, వంట పాత్రలు అపరిశుభ్రంగా ఉండడం వల్లే అస్వస్థతకు కారణమని గ్రామస్తుల ఆరోపణలతో వాటినీ పరిశీలించారు. సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఐసీడీఎస్ పీడీ, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ తెలిపారు. కాగా అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని, అందరూ కోలుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీఓ డిల్లీశ్వరి, సూపర్‌వైజర్ పుష్ప, ఆదోని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ మధుసూదన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.


