సంచార పశువైద్య కేంద్రాలకు మందులొచ్చాయి
కర్నూలు(అగ్రికల్చర్): మూగజీవులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన సంచార పశువైద్య కేంద్రాలకు ఎట్టకేలకు మందులు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆ కేంద్రాలు మనుగడ కోల్పోతున్న వైనాన్ని వివరిస్తూ ఈ నెల 5వ తేదీన మూగబోయిన సేవలు అనే శీర్షికపై సాక్షిలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కథనం ఉన్నత స్థాయి దృష్టికి పోవడంతో సంచార పశువైద్య కేంద్రాలకు మందులు సరఫరా అయ్యాయి. 10 రకాల మందులను సరఫరా చేసినట్లు పశుసంవర్ధకశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే 1962 పనితీరు మెరుగుపడలేదు. టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే తగలకపోవడం, రింగ్ అయినా లిఫ్ట్ చేయకపోవడం ఇప్పటికీ జరుగుతోంది. ఉదయం 11 తర్వాత కాల్స్‌కు స్పందిస్తున్నట్లు సమాచారం.
12న కర్నూలుకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్
కర్నూలు(సెంట్రల్): ఆర్‌యూ నాలుగో స్నాతకోత్సవం, మాంటెస్సోరి పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కర్నూలుకు రానున్నారు. గవర్నర్ పర్యటనకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్, ఎస్పీ, డీఐజీ, ఎయిర్‌పోర్టు డైరెక్టర్లకు రాజ్‌భవన్ నుంచి సమాచారాన్ని అందించారు. 12వ తేదీ ఉదయం 10.30 గంటలకు గవర్నర్ ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి కర్నూలులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 10.50 గంటలకు రోడ్డు మార్గంలో రాయలసీమ యూనివర్సిటీకి చేరుకుంటారు. 11 నుంచి 12.15 గంటల వరకు రాయలసీమ యూనివర్సిటీ నాలుగో స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అనంతరం 12.20 గంటలకు మాంటెస్సోరి ఇండస్ రెసిడెన్షియల్ స్కూల్‌కు చేరుకుంటారు. అక్కడ మాంటెస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం తిరిగి 4.10 గంటలకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టు చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు.
అడవుల సంరక్షణకు ప్రాధాన్యత
కర్నూలు కల్చరల్: అడవుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రధానంగా అటవీ ఉద్యోగులు ఈ బాధ్యతను మరువకూడదని ఆ శాఖ కర్నూలు సర్కిల్ కన్జర్వేటర్ బీవీఏ కృష్ణ మూర్తి అన్నారు. సోమవారం అటవీ శాఖ సర్కిల్ కార్యాలయంలో అటవీ అమర వీరుల దినోత్స వం నిర్వహించారు. చీఫ్ కన్జర్వేటర్‌తో పాటు డీఎఫ్‌వో శ్యామల, రేంజర్లు, అటవీ శాఖ ఉద్యోగులు అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎఫ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో 23 మంది అటవీ శాఖ ఉద్యోగులు విధి నిర్వహణ లో అమరులయ్యారన్నారు. వారి సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ ఎఫ్‌ఆర్‌ఓ రమణారెడ్డి, కర్నూలు డివిజన్ ఎఫ్‌ఆర్‌ఓ విజయకుమార్, ఏవో అబ్దుల్ సుభాన్, కార్యాలయ సూపరింటెండెంట్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.


