స్కూటర్ అదుపుతప్పి ..
ఆలూరు రూరల్: స్కూటర్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని కురువళ్లి సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ మన్మథ విజయ్ తెలిపిన వివరాలు.. హాలహర్వి మండల కేంద్రానికి చెందిన షేక్షావలి బెంగళూరులో గౌండా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం సొంత పని నిమిత్తం ఆలూరు వచ్చి హాలహర్వికి వెళ్తుండగా కురువళ్లి సమీపంలోని హైవే 167లో కుక్కను ఢీకొట్టి స్కూటర్ అదుపుతప్పి కిందపడ్డాడు. ప్రయాణికులు గమనించి 108 అంబులెన్సులో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుడు షేక్షావలికి భార్య షాషా బీ, ఇద్దరు పిల్లలు సంతానం. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విలేకరులకు తెలిపారు.
లారీ, బొలెరో ఢీ.. ఒకరు మృతి
● మరో ముగ్గురికి గాయాలు
చిలుకూరు: లారీ, బొలెరో వాహనం ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని మిట్స్ కళాశాల సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నుంచి ఏపీలోని కర్నూలుకు వెళ్తున్న బొలెరో వాహనం చిలుకూరు మండల పరిధిలోని మిట్స్ కళాశాల వద్దకు రాగానే ఎదురుగా హుజూర్‌నగర్ నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఏపీలోని కర్నూలు పట్టణంలోని ఆర్‌ఆర్ నగర్‌కు చెందిన బొలేరో వాహన డ్రైవర్ నల్లబొక్కల రఘు(43) అక్కడికక్కడే మృతిచెందగా.. అదే వాహనంలో ప్రయాణిస్తున్న ఉపేంద్ర పవన్‌కుమార్‌రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. చిక్సిత నిమిత్తం అతడిని విజయవాడకు తరలించారు. అదేవిధంగా లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు భూమిని గుర్తించండి
కర్నూలు(సెంట్రల్): కర్నూలు నగరంలోని ఏ, బీ, సీ క్యాంపుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు తగిన భూమిని గుర్తించాలని మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కర్నూలు నగరంలోని ఏ, బి, సి క్యాంపుల్లో ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ భూమిని గుర్తించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, డీఆర్వో వెంకటనారాయ ణమ్మ పాల్గొన్నారు.


