పశ్చిమ ప్రాంతం అభివృద్ధి పట్టదా?
ఆదోని రూరల్: అన్ని విధాలుగా వెనుకబడిన పశ్చిమ ప్రాంతం అభివృద్ధి పట్టదా అని సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్, సీపీఎం జిల్లా కార్య దర్శి గౌస్‌దేశాయ్ చంద్రబాబు సర్కారును ప్రశ్నించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో ఆదోని సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన పాదయాత్ర సోమవారం ఆదోని సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ భారీ ధర్నా చేపట్టి వారు మాట్లాడారు. కర్నూలు జిల్లా నుంచి పలువురు రాష్ట్ర మంత్రులుగా, కేంద్రమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించారన్నారు. అందుకే ఇక్కడి నుంచి చాలా మంది ఇతర ప్రాంతాలకు వలసవెళ్లి బతుకుతున్నారన్నారు. కోసిగి, పెద్దకడబూరు, ఆదోని, ఆస్పరి, ఆలూరు, కౌతాళం మండలాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్నారు. రెండో ముంబాయిగా పిలువబడే ఆదోనిలో ప్రస్తుతం పరిశ్రమలు మూతపడి వెలవెలబోతుందన్నారు. కార్మికులకు, యువకులకు ఉపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు పరిశ్రమలు తీసుకువచ్చి వారికి ఉపాధి కల్పించడంలో విఫలమైందన్నారు. ఈ ప్రాంతంలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కూడా జరగడం లేదని, ఎందుకో పాలకులు వాటి విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నారు. ఏటా వంద ల టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతున్నా చోద్యం చూస్తున్నారన్నారు. ఒడిసి పట్టి ఈ ప్రాంతా న్ని సస్యశ్యామలం చేయాలనే ఆలోచన చేయడం లేద న్నారు. హగరి నదిపై వేదావతి ప్రాజెక్టు, నగరడోన రిజర్వాయర్ నిర్మాణం తదితరవి మధ్యలోనే ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, అలాగే ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాల కల్పనకు పరిశ్రమలు నెలకొల్పాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్‌కలెక్టర్ కార్యాలయ ఏఓ వసుంధరకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాధాకృష్ణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సాగు, తాగునీటి ప్రాజెక్టులను
పూర్తి చేయడంలో
చంద్రబాబు ప్రభుత్వం విఫలం
సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు
ఎంఏ గఫూర్


