
దంపతులను రక్షించిన పోలీసులు
బనగానపల్లె రూరల్: అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన దంపతులను పోలీసులు రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో స్పందించడంతో ఇద్దరిని కాపాడారు. బనగానపల్లె సీఐ ప్రవీణ్‌కుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన మద్ది లేటి ఆయన భార్య శశికళ కూలీ పనులు చేసుకొని జీవిస్తున్నారు. అయితే వారికి రూ.3 లక్షల అప్పులు ఉండడంతో, అప్పును తీర్చలేక మానసికంగా కుంగిపోయారు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బనగానపల్లెకు వచ్చారు. కుటుంబీకులు అనుమానంతో బనగానపల్లె పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో వారి వద్ద ఉన్న ఫోన్ ఆధారంగా రవ్వలకొండ సమీపంలోని ఎస్‌ఆర్‌బీసీ కాల్వ వద్ద ఆత్మహత్య కు యత్నించేందుకు సిద్ధంగా ఉన్న దంపతులను ఎస్‌ఐ దుగ్గిరెడ్డితో పాటు పోలీసు సిబ్బంది గుర్తించారు. వారిని స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి ఆత్మహత్య చేసుకునే ఆలోచన నుంచి విరమింపచేసినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. జీవితం చాలా అమూల్యమైందని, చిన్నచిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకోరాదని సీఐ సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మనోధైర్యంతో ఎదుర్కోవాలన్నారు. దంపతులను రక్షించిన ఎస్‌ఐ దుగ్గిరెడ్డితో పాటు పోలీసులను ఉన్నతాధికారులతో పాటు పలువురు అభినందించారు.