
పెన్షనర్ల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
● జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్
రామచంద్రరావు
కర్నూలు(అగ్రికల్చర్): పెన్షనర్ల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ రామచంద్రరావు తెలిపారు. ఆదివారం సి.క్యాంపు సెంటరులోని కర్నూలు డివిజన్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ స్పెషిలిటీస్ సెంటరు ఆధ్వర్యంలో ప్రత్యేక మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ట్రెజరీ అధికారులు, సిబ్బందికి, పెన్షనర్లకు లివర్ స్కానింగ్, ప్యాట్ స్థాయి, ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ట్రెజరీ డీడీ రామచంద్రరావు మాట్లాడుతూ..పెన్షనర్లందరూ వయోవృద్ధులే అయినందున వారి ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ స్పెషిలిటీస్ సెంటరు డాక్టర్లతో పాటు ఏటీవో రఘువీర్, ఎస్‌టీవో విక్రాంత్, కర్నూలు పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో విద్యార్థి, ప్రజా సంఘాల హక్కులను కూటమి ప్రభుత్వం హరిస్తోందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి ఆరోపించారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. విద్యాసంస్థల ఆవరణలోకి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు బయటి ప్రపంచానికి తెలియకూడదనే కుట్రతో ప్రభుత్వం ఇలాంటి నియంతృత్వ పోకడలతో ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఎన్నికలకు ముందు ప్రజా సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతూ.. సమస్యలపై గట్టిగా పోరాడాలని చెిప్పిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు ఇలాంటి జీఓలు ఇవ్వడం దారుణమన్నారు. జీఓను రద్దు చేయకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మహిళా నేతలు ఈడిగ భారతమ్మ, పాలెం రాధ, హుస్సేన్‌బీ, ఎలీషమ్మ, ఈరమ్మ, ఖాసీంబీ తదితరులు పాల్గొన్నారు.