
డెంగీ బూచీ.. రోగులను దోచి!
ఎలీసా టెస్ట్ ద్వారానే
డెంగీ నిర్ధారణ చేయాలి
కర్నూలు, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ డెంగీ నిర్ధారణకు ఎలీసా టెస్ట్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జ్వరపీడితులకు ర్యాపిడ్ టెస్ట్‌లో పాజిటివ్ వస్తే వెంటనే ఆ వ్యక్తి రక్తాన్ని ఎలీసా టెస్ట్ కోసం పంపించాలి. ఎలీసా టెస్ట్‌లో డెంగీ నిర్ధ్దారణ అయితేనే చికిత్స చేయాలి. డెంగీగా చెప్పి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.
– నూకరాజు, మలేరియా అధికారి, కర్నూలు
కర్నూలు(హాస్పిటల్): దోపిడీ జబ్బు ఉన్న కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు డెంగీ బూచీతో జ్వరపీడితుల జేబులను ఖాళీ చేస్తున్నాయి. జ్వరంతో వెళ్తే చాలు ర్యాపిడ్ టెస్ట్ చేయడం, ప్లేటెలెట్స్ తగ్గాయని భయపెట్టడం, తర్వాత చికిత్స పేరుతో రూ. లక్ష నుంచి రూ. లక్షన్నర వరకు బిల్లులు బాదడం పరిపాటిగా మారింది. డెంగీ జ్వరం నిర్ధారణ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా గాకుండా ఎలీసా టెస్ట్ ద్వారా చేయాలని అధికారులు చెబుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకునేవారు లేరు. జిల్లాలో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటితో పాటు మరో 12 ఆరోగ్య కేంద్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. వీటితో పాటు 28 అర్బన్‌హెల్త్ సెంటర్లు, 5 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, రెండు ఏరియా ఆసుపత్రులు, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఉన్నాయి. వీటితో పాటు కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలో 170కి పైగా రిజిస్టర్డ్ ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. జిల్లాలో గత జనవరి నుంచి ఇప్పటి వరకు 190 మంది వరకు డెంగీ వ్యాధిగ్రస్తుల సంఖ్య నమోదైంది. ఈ వ్యాధి లక్షణాలతో ఉన్న వారు దీనికి మూడింతలు ఉన్నారు. చాలా మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. కాస్త ఆర్థిక స్తోమత ఉన్న వారు మాత్రం ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో వైద్యుల సంఖ్య పెరగడం, అందరికీ డిమాండ్ లేకపోవడం, రోగుల సంఖ్య తక్కువగా ఉంటోంది. దీంతో కొందరు వైద్యులు వచ్చిన వారి నుంచే ఎక్కువగా వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. కొందరు ఆర్‌ఎంపీలకు 50 శాతానికి పైగా కమీషన్లు ముట్టజెబుతూ వారి ఆసుపత్రులకు రోగులు తెచ్చేలా చేసుకుంటున్నారు. ఇలా వచ్చిన వారిని ముందుగా రూ.5వేలకు తగ్గకుండా వివిధ రకాల వైద్యపరీక్షలు చేయించి చికిత్స చేస్తున్నారు. సాధారణ జ్వరంతో వెళ్లినా రూ.6వేలకు తక్కువగాకుండా వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఆసుపత్రులు ఎక్కువగా కర్నూలులోని కొత్తబస్టాండ్, ఎన్‌ఆర్ పేట, గాయత్రి ఎస్టేట్ వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. వైద్యులకు అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చుకోలేని కొందరు రోగులు ప్రైవేటు వైద్యుల వద్ద పరిస్థితిని అర్థం చేసుకుని తాము మళ్లీ వస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే చాలా మంది రోగులు జ్వరం వచ్చిందంటే ముందుగా మెడికల్‌షాపులకు వెళ్లి లక్షణాలు చెప్పి మందులు కొని వాడి తగ్గించుకుంటున్నారు.
డెంగీ ఇలా వస్తుంది
డెంగీ జ్వరం ఏడిస్ ఈజిప్టై అనే దోమకాటు వల్ల వస్తుంది. ఈ దోమ శరీరంపై నల్లటి, తెల్లటి చారలు ఉంటాయి. శరీరంపై చారలు ఉండటం వల్ల దీనిని పులిదోమ అని కూడా పిలుస్తారు. ఈ దోమ శుభ్రమైన, నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెడుతుంది. సూర్యోదయమైన రెండు గంటల వరకు, సూర్యాస్తమయానికి రెండు గంటల ముందు మాత్రమే ఇది కుడుతుంది. ఇది కేవలం రెండు వారాలు మాత్రమే జీవిస్తుంది. ఈ దోమ తన జీవితకాలంలో మూడుసార్లు మాత్రమే గుడ్లు పెడుతుంది. ప్రతిసారీ వంద గుడ్లను పెడుతుంది. ఈ దోమలు ఇంట్లో బట్టలు, పరుపులు, కర్టన్స్ వెనుక కూడా దాక్కుంటాయి.
ఈ దశలోనే ఆసుపత్రిలో చేర్చాలి
తీవ్రమైన కడుపునొప్పి, రక్తవాంతులు అవుతుంటే, శరీరంపై ఎర్రటి దద్దుర్లు రావడం, ముక్కు, చిగుళ్లల్లో రక్తం స్రవించడం, మలమూత్రాల్లో రక్తం పడటం, మత్తుగా ఉండటం, ఊపిరితీసుకోవడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆసుపత్రిలో చేర్చాలి.
డెంగీ షాక్ సిండ్రోమ్, డెంగీ హెమరేజిక్ సిండ్రోమ్ దశలో ఆలస్యం చేయకుండా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాలి.
సాధారణ మనిషిలో ప్లేట్‌లెట్లు 1.50 లక్షల నుంచి 4.50 లక్షల వరకు ఉంటాయి. డెంగీ సీజన్‌లో ఈ రక్తకణాల సంఖ్య 10వేలలోపు ఉంటే మాత్రమే జాగ్రత్త పడి ఆసుపత్రిలో చేరాలి.
జ్వరం తగ్గినా కూడా వారం తర్వాత అప్రమత్తంగా ఉండాలి. ఈ దశలో శరీరంలో వాపులు వస్తే మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
ర్యాపిడ్ టెస్ట్‌తో దోపిడీ
డెంగీ పరీక్ష నిర్ధారణ కోసం మొదట ర్యాపిడ్ కిట్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. అందులో డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అయితే ఆ రోగి రక్తనమూనాలను కర్నూలు మెడికల్ కాలేజిలోని మైక్రోబయాలజి ల్యాబ్, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలి. ఈ ల్యాబ్‌లకు ప్రతిరోజూ 30 నుంచి 40 వరకు రక్తనమూనాలు వస్తున్నాయి. ఇక్కడి నివేదికల ఆధారంగా డెంగీ నిర్దారణ చేస్తారు. ఇక్కడి వైద్యులు ఇచ్చే టెస్ట్ ఆధారంగానే వ్యాధి నిర్దారణ చేస్తారు. కానీ అధిక శాతం ప్రైవేటు ఆసుపత్రులు కేవలం ర్యాపిడ్ కిట్‌లో వచ్చిన నివేదికల ఆధారంగా డెంగీగా చెప్పి చికిత్స చేస్తున్నారు. రక్తంలో ప్లేట్‌లెట్లు(రక్తకణాలు) తగ్గాయని చెప్పి బ్లడ్‌బ్యాంకులకు పంపి వాటిని తెప్పించి ఎక్కిస్తున్నారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా
వసూళ్లు
ర్యాపిడ్ టెస్ట్ రిపోర్టుతోనే చికిత్స
ఎలీసా టెస్ట్ చేయించని ఆసుపత్రులు
పలు ల్యాబ్‌ల్లో తప్పుడు నివేదికలు..!
ప్రతి జ్వరమూ.. డెంగీ కాదంటున్న
వైద్యులు

డెంగీ బూచీ.. రోగులను దోచి!