
గ్రామీణాభివృద్ధిలో పంచాయతీరాజ్ కీలకం
● జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా
కర్నూలు(అర్బన్): గ్రామీణాభివృద్ధి, స్థానిక పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నదని జిల్లా కలెక్టర్ పీ రంజిత్‌బాషా అన్నారు. గురువారం జిల్లా పరిషత్ మినీ సమావేశ భవనంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2025లో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థకు 1947 స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఉన్న పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్‌లో 243 ఆర్టికల్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందిస్తూ చట్టం చేశారన్నారు. ఈ చట్టాన్ని రాజ్యసభ, లోక్‌సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా ఆమోదం చేసిన తరువాత 1993 ఏప్రెల్ 24వ తేదీన నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థలో పర్యవేక్షణ బలోపేతం అయ్యిందన్నారు. పంచాయతీలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వడం, స్వయం ప్రతిపత్తి కల్పించడం వంటి సంస్కరణలు వచ్చాయన్నారు. ఫైనాన్స్ పరిధిలోకి రావడం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా సక్రమంగా ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. స్థానిక పాలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంలో పీఆర్ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయన్నారు.
నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డుకు పెరవలి ఎంపిక..
నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డుల కోసం దేశ వ్యాప్తంగా 1.40 లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో ఆరు గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారని కలెక్టర్ చెప్పారు. ఎంపికై న ఆరు గ్రామ పంచాయతీల్లో జిల్లాలోని మద్దికెర మండలం పెరవలి గ్రామ పంచాయతీ ఉండడం అభినందనీయమన్నారు. అలాగే ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ కింద జిల్లాలోని మద్దికెర, హొళగుంద, చిప్పగిరి మండలాలు ఎంపికయ్యాయన్నారు. ఇందులో మద్దికెర మండలం దక్షిణ భారత దేశంలో ప్రథమ స్థానంలో ఉందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.50 కోట్లను మంజూ రు చేసిందన్నారు. కార్యక్రమంలో పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ పర్యవేక్షక ఇంజనీర్లు వీ రామచంద్రారెడ్డి, బీ నాగేశ్వరరావు, కర్నూలు డివిజినల్ పంచాయతీ అధికారిణి టీ లక్ష్మి, పీఆర్ ఈఈ మద్దన్న, పీఏ టు ఎస్‌ఈ బండారు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణాభివృద్ధిలో పంచాయతీరాజ్ కీలకం