4 కి.మీ 400 గుంతలు
● శిథిలావస్థలో అంతర్రాష్ట్ర రహదారి ● తరచూ ప్రమాదాలు ● వాహనదారుల కష్టాలు
ఆలూరు రూరల్/హాలహర్వి: సంక్రాంతిలోగా రాష్ట్రంలో గుంతలు లేని రహదారులుగా మారుస్తామంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. 2025 సంక్రాంతి పోయి, 2026 సంక్రాంతి వస్తున్నా రోడ్లు బాగు పడలేదు. అదే గుంతలు.. అవే కష్టాలు వాహనదారులను భయపెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల రహదాలను పరిస్థితి ఒక విధంగా ఉంటే ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాలను కలిపే ప్రధాన రహదారి దుస్థితి మరింత అధ్వానంగా మారింది. చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ రహదారి మరమ్మతులు నోచుకోలేదు. 2018లో హాలహర్వి మండలం క్షేత్రగుడి నుంచి కర్ణాటక సరిహద్దు వరకు 4 కి.మీ రహదారి నిర్మించారు. గత 15 నెలలుగా ఈ రహదారిలో పెద్దపెద్ద గుంతలు పడ్డాయి. 4 కి.మీ రహదారిలో 400 గుంతలు కనిపిస్తాయి. భారీ వాహనాల రాకపోకల వలన దుమ్ము ధూళితో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రెండు రాష్ట్రాలను కలిపే ఓ ప్రధాని రహదారి కావడంతో నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటోంది. హైవే–167కు ప్రత్యామ్నయ రహదారి కావడంతో ఆలూరు నుంచి బళ్లారికి రోజు వందలాది వాహనాలు ఈ మార్గం ద్వారా వెళ్తుంటాయి. వర్షాకాలంలో ఈ రహదారిలో ప్రయాణించాలంటే ప్రయాణికులు నరకం చూడాల్సిన పరిస్థితి. రహదారుల గుంతలు కనిపించకుండా కళ్లకు గంతులు కట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం కళ్లకున్న గంతులు తొలగించి రహదారుల వైపు చూసి వాటిని బాగుచేయాలని ప్రయాణీకులు ప్రజలు వాపోతున్నారు.


