కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ప్రారంభం
కర్నూలు(సెంట్రల్): ఆరోగ్యం, విద్య, సంక్షేమ వసతి గృహాలు, సమగ్ర శిశు అభివృద్ధి శాఖల్లో వచ్చే ఫిర్యాదుల స్వీకారణకు కలెక్టర్‌లో స్పెషల్ కంట్రోల్ రూం ఏర్పాటైంది. సర్వే ఏడీ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన స్పెషల్ కంట్రోల్ రూంను బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయా శాఖల్లో అమలు చేస్తున్న పథకాల నిర్వహణకు సలహాలు, సూచనలు, ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 18004254299 అందుబాటులో ఉంటుందన్నారు. ఇప్పటి వరకు 109 కాల్స్ రాగా 99 పరిష్కారం అయ్యాయన్నారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, సెట్కూరు సీఈఓ డాక్టర్ కె.వేణుగోపాల్ పాల్గొన్నారు.
3న నంద్యాల జిల్లా ఎపీఎన్‌జీజీవోస్ ఎన్నికలు
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎన్‌జీజీవోస్ అసోసియేషన్ నంద్యాల జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు జనవరి 3న జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలనే తాత్కాలికంగా అడ్‌హాక్ కమిటీని రాష్ట్ర నాయకత్వం నియమించింది. తాజాగా పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్నికల ప్రక్రియను చేపట్టనున్నారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు ప్రసాద్ యాదవ్, సహాయ ఎన్నికల అధికారిగా వైఎస్‌ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, పరిశీలకులుగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివప్రసాద్ నియమితులయ్యారు. నంద్యాలలోని ఎన్‌జీవో హోమ్‌లో ఎన్నికల ప్రక్రియ చేపడుతారు. కర్నూలు జిల్లాకు కూడా అడ్‌హాక్ కమిటీ ఉంది. ఇటీవలనే అన్ని తాలూకాలకు ఎన్నికలు నిర్వహించారు. మరో వారం రోజుల్లో కర్నూలు జిల్లా ఎన్నికలు కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది.


