ఆళ్లగడ్డ/రుద్రవరం: చందలూరు–నల్లగట్ల గ్రామ పొలిమేర మధ్యలో వక్కిలేరు వాగు నీటిలో మునిగి ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం గొర్రెలను ఏరు దాటిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రుద్ర వరం మండలం నక్కలదిన్నెకు చెందిన శివరాం, పాపారాయుడు, నారబోయిన కృష్ణుడు (54) అనే ముగ్గురు దాదాపు 700 గొర్రెలను పెంచుతున్నారు. వాటిని మేపేందుకు ప్రతి రోజు చుట్టు పక్కల గ్రామాల పొలాల్లోకి వెళ్లేవారు. ఈక్రమంలోనే ఆదివారం నక్కలదిన్నె నుంచి చందలూ రు–నల్లగట్ల పొలిమేర మధ్యకు వెళ్లారు. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో గొర్రెలను సమీపంలోని వక్కిలేరు వాగులోకి తోలారు. అందులో వాటికి ఈత నేర్పి తీసుకొస్తున్న సమయంలో కొన్ని గొర్రెలు వారిపై దూకాయి. ఈ ఘటనలో శివరాం, పాపారాయుడు అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకోగా నారబోయిన కృష్ణుడు మాత్రం నీటిలో మునిగిపోయాడు. ఎంత గాలించినా ఆచూకీ లభించకపోవడంతో సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ పోలీసులు అక్కడికి చేరుకొని స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. నారబోయిన కృష్ణుడుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని పోలీసులు చందలూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేయించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆళ్లగడ్డ పోలీసులు తెలిపారు.


