
డయేరియా కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి
నంద్యాలటౌన్: ప్రజలు అతిసార వ్యాధి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ మెడికల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీపీఓ మంజులవాణి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మనోహర్‌లతో కలిసి డయేరియా వ్యాధి నియంత్రణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీరు కలుషితం కావడం, తాగునీటిని క్లోరినేట్ చేయకపోవడం, పారిశుద్ధ్య లోపం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామస్తులు క్లోరినేషన్ చేసిన సురక్షితమైన, కాచి చల్లార్చిన నీటిని తాగేలా సలహాలివ్వాలని సూచించారు. పరిసరాల, వ్యక్తిగత శుభ్రత గురించి ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. ప్రతివారం ట్యాంకులను శుభ్రం చేయించి, క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున గ్రామాల్లో పైపులైన్లు పగిలి, నీరు కలుషితమయ్యే ప్రమాదముందని, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఐవోటీలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు సిటీ: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ)లో శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ మ్యానుఫాక్చరింగ్ డైరెక్టర్ డీవీఎల్‌ఎన్ సోమయాజులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల్లో నాన్ కంప్యూటర్ బ్రాంచ్‌లో బోధన చేసే అధ్యాపకులు ఈ శిక్షణకు అర్హూలని పేర్కొన్నారు. ఏఐసీటీఈ వెబ్‌సైట్‌లో వచ్చే నెల 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, మొదటి విడతలో మొత్తం 50 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రెండో రోజు కొనసాగిన ఉపాధ్యాయుల శిక్షణ
గోస్పాడు: స్థానిక మోడల్ స్కూల్‌లో ప్రభుత్వ పాఠశాలల సబ్జెక్టు ఉపాధ్యాయులకు సీబీఎస్‌ఈ సిలబస్‌పై శనివారం రెండో రోజు శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర కమిషనర్ కార్యాలయ పాఠశాల విద్య పరిశీలకులు శరత్ హాజరై శిక్షణ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీబీఎస్‌ఈ అమలు చేస్తున్నట్లు చెప్పారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను బోధనలో ఉపయోగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ బేగ్, ఎంఈఓ అబ్దుల్‌కరీం పాల్గొన్నారు.

డయేరియా కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి