జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు
జిల్లాలో 491 పంచాయతీలు.. 4,780 వార్డులు
జిల్లాలో 9,98,054మంది ఓటర్లు
4,924 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహణ
మొదటి దశలో గుడివాడ రెవెన్యూ డివిజన్
మోగిన సైరన్..
పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
చిలకలపూడి(మచిలీపట్నం): పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సైరన్ మోగింది. మొదటిగా మునిసిపల్ ఎన్నికలు నిర్వహించగా అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల వంతు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేసింది. జిల్లాలో 491 పంచాయతీల్లోని 491 పంచాయతీ సర్పంచులు, 4,780 వార్డులకు ఎన్నికలకు నిర్వహించాల్సి ఉంది. 491 సర్పంచ్ సర్పంచ్ స్థానాల్లో 241 స్థానాలు మహిళలకు కేటాయించగా, 250 స్థానాలను జనరల్ కేటగిరీకి కేటాయించారు. ఈ ఎన్నికలకు జిల్లాలో మూడు దశల్లో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో 491 పంచాయతీల్లో 9,98,054 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 4,84,800 పురుషులు, 5,13,230 మహిళలు, 24 మంది ఇతరులు ఉన్నారు. వీరు ఓటు వేసేందుకు 4,924 పోలింగ్ బూత్‌లను గ్రామాల్లో ఏర్పాటు చేశారు.
మొదటి దశ గుడివాడ డివిజన్‌లో..
జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదటిగా గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాలలో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 17వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణను 56 కేంద్రాల ద్వారా నిర్వహించనున్నారు. 18వ తేదీన నామినేషన్ల పరిశీలన, 19న అభ్యంతరాలు, 20న అభ్యంతరాల పరిష్కారం, 21న నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం జరిగిన అనంతరం అభ్యర్థులను ప్రకటిస్తారు. 26న పోలింగ్ నిర్వహించి అదేరోజు ఓట్ల లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. గుడివాడ డివిజన్‌లోని బాపులపాడు, గన్నవరం, గుడ్లవల్లేరు, నందివాడ, ఉంగుటూరు, గుడివాడ మండలాల్లోని గ్రామా ల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మండలాల్లో 136 గ్రామపంచాయతీలు, 1304 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు 1342 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 2,78,522 మంది, పురుషులు 1,33,727, మహిళలు 1,44,786, ఇతరులు 9మంది ఉన్నారు.
ఎన్నికల సిబ్బందికి శిక్షణ..
ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు నియమించిన సిబ్బందికి శిక్షణ తరగతులను ఇప్పటికే నిర్వహించారు. రిటర్నింగ్ అధికారులు ఎన్నికల్లో సిబ్బందికి ఈ నెల 10వ తేదీన గుడివాడ డివిజన్‌కు సంబంధించి శిక్షణ తరగతులను కలెక్టర్ డీకే బాలాజీ నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.


