కొండపై నుంచి కిందపడిన భక్తురాలు!
ప్రమాదమా.. ఆత్మహత్యాయత్నమా?
భక్తుల సమాచారంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది
దేవస్థానం అంబులెన్స్‌లో
ప్రభుత్వాసుపత్రికి తరలింపు
అనుమానాస్పద అంశాలపై పోలీసుల విచారణ
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శుక్రవారం ఓ మహిళ కొండపై నుంచి కిందపడిన ఘటన కలకలం రేపింది. దుర్గగుడి పాత మెట్ల మార్గానికి సమీపంలోని చెట్ల మధ్య గాయాలతో పడి ఉన్న మహిళను భక్తులు గుర్తించి ఆలయ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకుని ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఆత్మహత్యాయత్నమా? అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన దేశబోయిన బాలఅంజమ్మ శుక్రవారం తెల్లవారుజామున బస్సులో విజయవాడకు చేరుకుంది. ఉదయం ఆరు గంటల సమయంలో రాజగోపురం ఎదుట ఆమె తిరుగుతున్నట్లు ఆలయ సిబ్బంది గుర్తించారు. అనంతరం ఉదయం 11 గంటల సమయంలో ఘాట్‌రోడ్డులోని ప్రోటోకాల్ కార్యాలయం వద్దకు వచ్చిన కొందరు భక్తులు.. గోశాల, మరుగుదొడ్ల దిగువన చెట్ల మధ్య ఓ మహిళ పడి ఉందని సిబ్బందికి సమాచారం అందించారు.
చెట్ల మధ్య గాయాలతో మహిళ
ప్రొటోకాల్ కార్యాలయం వద్ద విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గణేష్, మరో గార్డు, ఆలయ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన నాగరాజు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గోశాల దిగువన ఉన్న మరుగుదొడ్ల సమీపం నుంచి పరిశీలించగా పాత మెట్ల మార్గానికి దగ్గరలోని చెట్ల మధ్య మహిళ గాయాలతో కనిపించింది. వెంటనే గణేష్, నాగరాజు చెట్ల మధ్యకు వెళ్లి ఆమెను చేతులపై ఎత్తుకుని కొండపైకి తీసుకొచ్చారు.
బ్యాటరీ వాహనంపై టోల్‌గేట్‌కు..
ఘటన జరిగిన సమయంలో దేవస్థానం అంబులెన్స్ ఘాట్‌రోడ్డులో కాకుండా మహామండపం దిగువన ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో ఆలయ సిబ్బంది బ్యాటరీ వాహనంపై మహిళను టోల్‌గేట్ వరకు తీసుకెళ్లి, అక్కడి నుంచి దేవస్థానం అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బాలఅంజమ్మకు కాలు, నడుము భాగాల్లో గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు.
అనుమానాలకు తావిస్తున్న పరిణామాలు..
ఘటనపై సమాచారం అందుకున్న ఆలయ ఈవో శీనానాయక్ వెంటనే సమాచార కేంద్రానికి చేరుకుని బాధితురాలి వివరాలు తెలుసుకున్నారు. అంబులెన్స్ సిబ్బందితో ఫోన్‌లో మాట్లాడి ఆమెకు తక్షణ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలఅంజమ్మ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కొంత మెరుగ్గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో సాయంత్రానికి వారు ఆసుపత్రికి చేరుకున్నారు.
పోలీసు విచారణలో తేలాలి
ఘటనకు సంబంధించి బాలఅంజమ్మను పోలీసులు ప్రశ్నించినా ఆమె నుంచి స్పష్టమైన సమాధానాలు రాకపోవడం, ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొండపైనే ఆమె సెల్‌ఫోన్, ఆధార్ కార్డులు లభించడం, బట్టల బ్యాగుతో ఒంటరిగా విజయవాడకు రావడం వంటి అంశాలు పలు సందేహాలకు తావిస్తున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ వెంట లేకపోవడంతో కుటుంబపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు గల అసలు కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.


