కూచిపూడి(మొవ్వ): మొవ్వ మండలంలోని ప్రముఖ నాట్యక్షేత్రం కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి నాట్య కళా పీఠాన్ని ఇస్రో విశ్రాంత డైరెక్టర్ పద్మ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ తన స్నేహితుడితో కలిసి శుక్రవారం సందర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన ప్రసాద్ తొలిసారిగా కూచిపూడిని సందర్శించి, విద్యార్థుల నాట్యాన్ని తిలకించానని ఈ అనుభూతి తీపి గుర్తుగా ఉంటుందని తన ఆనందాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా కళా పీఠం వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ ఆనాటి కళాకారుల విశేషాలను వెల్లడించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు, టీచింగ్ అసిస్టెంట్ పసుమర్తి హరినాథశాస్త్రి, గ్రంథాలయ పాలకులు వైవీ ఫణి కుమార్ పాల్గొన్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): హైదరాబాద్లోని వోక్సేన్ యూనివర్సిటీలో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు జరిగిన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్(మహిళల) టోర్నమెంట్లో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మహిళల చెస్ జట్టు ఆరో స్థానం సాధించింది. ఈ టోర్నమెంట్లో పతకాలు పొందిన విద్యార్థులను నగరంలోని యూనివర్సిటీ ఆవరణలో వీసీ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయి సుధీర్, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సీహెచ్ శ్రీకాంత్, స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ఈ.త్రిమూర్తి శుక్రవారం అభినందించారు. ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశం అంతటా ఉన్న మొత్తం 56 వర్సిటీలకు చెందిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయన్నారు. తమ యూనివర్సిటీ జట్టులో ఎం.సాయి దివ్య, డి.అమూల్య, నివేదితా బాయ్, డి.అనన్య, ఎన్.సాత్విక, ఎ. శ్రీనిధి సభ్యులుగా ఉన్నారన్నారు. కాగా పోటీల్లోని 3వ బోర్డులో ఎం.సాయి దివ్య మొదటి బహుమతిని గెలుచుకుందని తెలిపారు.


