కూటమి ఏజెంట్లకు ఒక న్యాయం.. వైఎస్సార్ సీపీ ఏజెంట్లకు ఒక న్యాయమా? వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ తన్నీరు
జగ్గయ్యపేట అర్బన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కేంద్రం వద్ద శనివారం ఆర్వో అనుమతించినప్పటికీ తమ కౌంటింగ్ ఏజెంట్లను పోలీసులు ఎలా అడ్డుకుంటారని వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ప్రశ్నించారు. పట్టణంలోని ఎస్‌జీఎస్ కళాశాలలో కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీ కౌంటింగ్ ఏజెంట్లను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారి పరిశీలించి కౌంటింగ్ ఏజెంట్లుగా అనుమతి పత్రాలు జారీ చేసిన తరువాత కూడా వారిపై కేసులు ఉన్నాయనే కారణంతో పోలీసులు కౌంటింగ్ కేంద్రం వెలుపలే వారిని అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. కేసులు ఉన్నాయనే కారణంతో కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోవాలనుకుంటే, ఆ నిబంధన కేవలం వైఎస్సార్ సీపీ వారికే వర్తిస్తుందా? కూటమి పార్టీల ఏజెంట్లపై కేసులు లేవా? వారిని ఏ ప్రాతిపదికన కౌంటింగ్ హాల్‌లోకి అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ముఖ్యంగా జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరగా ల్సిన రెండు టేబుళ్ల వద్ద వైఎస్సార్ సీపీ తరఫున కౌంటింగ్ ఏజెంట్లు లేకుండా అడ్డుకోవడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను మినహాయించి కేవలం అధికార పక్షానికి అనుకూలంగా లెక్కింపు జరిగే పరిస్థితి కల్పించడం ఎన్నికల పారదర్శకతపై అనుమానాలు కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి అభ్యర్థికీ సమాన హక్కులు, ప్రతి పార్టీకి సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఒక పార్టీకి అనుకూలంగా, మరొక పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టంచేశారు. పోలీసుల ఏకపక్ష ధోరణి, కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకున్న తీరుపై పూర్తి వివరా లతో త్వరలో కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, ప్రతి ఓట్ల లెక్కింపులో అన్ని పార్టీల ఏజెంట్లకు సమాన అవకాశం ఉండాలన్నారు. కావున ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే చర్యలను వై ఎస్సార్ సీపీ సహించబోదని తన్నీరు నాగేశ్వరరావు స్పష్టం చేశారు.


