అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ 73వ డివిజన్ న్యూరాజరాజేశ్వరీపేటలోని ఐదు బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని విజయవాడ మేయర్ స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. న్యూఆర్‌ఆర్‌పేటలోని కేర్ అండ్ షేర్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సాయంత్రం 4:40 గంటలకు తాను సందర్శించినప్పుడు టీడీపీ, వైఎస్సార్ సీపీ రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుందని, దీని వల్ల పోలింగ్‌కు ఆటంకం కలిగిందంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీ)కి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో డివిజన్లోని ఐదు పోలింగ్ బూత్లలో జరిగిన పోలింగ్‌ను రద్దు చేసి తిరిగి పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అక్కడ విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డులు పరిస్థితిని అదుపు చేయలేకపోయారని ఆరోపించారు. అదనపు పోలీసు బలగాలు వచ్చి ఘర్షణకు దిగిన వారిని చెదరగొట్టారన్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు టీడీపీ వర్గానికి చెందిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. 73వ డివిజన్లోని 73/1, 73/2, 73/3, 73/4, 73/5 మొత్తం ఐదు పోలింగ్ బూత్‌లలో తిరిగి పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. అలాగే పోలింగ్‌కు ఆటంకం కలిగించిన వారందరినీ అరెస్ట్ చేయాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పటి వరకు తాను అక్కడే ఉండి ఆందోళన కొనసాగిస్తానంటూ పోలింగ్ కేంద్రం ఎదుటే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
పెడన: పురపాలక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్సులు తిరిగి స్వీకరించే సమయంలో ఎన్నికల నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కృష్ణాజిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి ఆయన సెయింట్ విన్సెంట్ పల్లోటి హైస్కూలులో ఏర్పాటు చేసిన రీసివింగ్ సెంటరు, లెక్కింపు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రిసీవింగ్ కేంద్రంలోని అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. పోలింగ్ ప్రక్రియ ముగించుకొని పోలింగ్ అధికారులు బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రిని రిసెప్షన్ కేంద్రానికి తీసుకువచ్చే సమయంలో అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడకుండా ప్రతి అంశాన్ని బాధ్యతాయుతంగా పరిశీలించాలన్నారు. చెక్‌లిస్ట్ ప్రకారం వెరిఫై చేసి, రికార్డు చేసిన తర్వాతే నిర్దేశిత రిసెప్షన్ కౌంటర్లు, స్ట్రాంగ్ రూములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్, అక్కడ ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లు భద్రపరిచిన నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచే ప్రక్రియను సంబంధిత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలోనే నిబంధనల ప్రకారం చేపట్టాలని సూచించారు. అనంతరం బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రిని నిర్దేశిత విధానంలో స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పెడన ఆర్వో ఎస్ పోతురాజు, ఏఈఆర్వో డి.కొండయ్య, సహాయ ఆర్వో కె.అనిల్‌కుమార్, టీపీవో సాంబశివరావు, టౌన్ సర్వేయర్ నాగరాజు, మున్సిపల్ ఏఈ సీతారామాంజనేయులు తదితరులున్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): అగ్రి గోల్డ్ బాధితులు, ఏజెంట్ల వద్ద ఉన్న ఒరిజినల్ బాండ్లను కానూరులోని ప్రాంతీయ సీఐడీ కార్యాలయంలో పరిశీలించనున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమ, మంగళవారాల్లో వీరులపాడు మండలం, ఈనెల 6, 7 తేదీల్లో చందర్లపాడు మండలానికి సంబంధించిన వారి బాండ్లు పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా రోజుల్లో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల్లోపు అగ్రి గోల్డ్ డిపాజిటర్లు, లబ్ధిదారులు, ఏజెంట్లు తమ బాండ్ల పరిశీలనకు రావాలని సూచించారు.
రోడ్డుకెక్కిన కూటమి విభేదాలు
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ‘పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నావురా.. నా.. కొ.. నీ అమ్మ..’ అంటూ కూటమి నేతలు ఒకరిపై మరోకరు బూతు పురాణం అందుకున్నారు. ఒకరినొకరు తోసుకున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్‌లో ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ డివిజన్‌లో కూటమి తరఫున జనసేన నుంచి అత్తులూరి కల్యాణి కార్పొరేటర్ అభ్యర్థ్థిగా పోటీలో నిలిచారు. అయితే జనసేన సీటును స్థానికంగా ఉండే కూర్మారావు ఆశించారు. మాజీ కార్పొరేటర్ భర్త అయిన పెద్దబాబు డివిజన్‌లోని ఈద్గామహాల్ రోడ్డులోని పోలింగ్ కేంద్రం దగ్గర ఉండగా, అక్కడికి దగ్గరలోనే ఇండిపెండెంట్ అభ్యర్థి పేరాబత్తుల రాజేశ్వరి కార్యాలయం వద్ద కూర్మారావు ఉన్నట్లు అతనికి తెలిసింది. అక్కడకు చేరుకున్న పెదబాబు, కూర్మారావు మధ్య వాదన మొదలైంది. ఈ క్రమంలోనే జనసేన కార్యకర్త దుక్కా దుర్గారావు, కూర్మారావు ఒకరిని మరోకరు నోటికి వచ్చినట్లు దూషించుకున్నారు. పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నావని కూర్మారావును దుర్గారావు విమర్శించగా, ‘నిన్నటి వరకు మీరు ఏ పార్టీలో ఉన్నారు? అన్ని పార్టీల జెండాలు మోసి ఇప్పుడు జనసేనలోకి వచ్చారు. మేము జనసేనలో తొలి నాటి నుంచి ఉన్నాం’ అంటూ బదులిచ్చారు. వారి తీరును చూసి ఓటర్లు విస్తుపోయారు.
పోలింగ్ కేంద్రం వద్ద స్వతంత్ర అభ్యర్థి ఆందోళన


