● నగరంంలో అడుగడుగునా కూటమి నేతల అక్రమాలు ● పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా నగదు పంపిణీ ● కూటమి నేతలకు అండగా పోలీసులు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ నగరపాలకసంస్థ ఎన్నికల్లో కూటమి నేతలు అడుగడుగనా అక్రమాలకు పాల్పడ్డారు. ఏంచేసైనా కూటమి అభ్యర్ధులను గెలిపించుకోవాలని అడ్డగోలుగా వ్యవహరించారు. దీంతో వారి తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తమ అభ్యర్ధుల కోసం ఉదయం నుంచి దాదాపుగా అన్ని డివిజన్‌లలోనూ కూటమి నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారంటూ అన్ని పక్షాలు మండిపడ్డాయి. పలు డివిజన్‌లలో రిగ్గింగ్‌కు పాల్పడినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మూడు నియోజకవర్గాల్లోనూ ఒకే రీతిలో కూటమి నేతలు వ్యవహరించారు.
యథేచ్ఛగా నగదు పంపిణీ..
కూటమి ఏదో విధంగా గెలవాలనే లక్ష్యంతో నగరంలో అన్ని డివిజన్‌లలోనూ కోట్లాది రూపాయాలు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. ఒకొక్క ఓటుకు రూ.వెయ్యి నుంచి ఐదు వేల వరకూ పంపిణీ చేశారు. పోలింగ్ రోజు ఆదివారం నాడు సైతం నగదు పంపిణీ అడ్డగోలుగా కొనసాగించారు. అంత భారీ మొత్తంలో నగదు పంపిణీ జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. అలాగే కొన్ని చోట్ల హెల్మెట్లు, చీరల పంపిణీ సైతం కూటమి నేతలు చేపట్టారు.
బూత్‌లో ఓట్లు లేని వ్యక్తులను ఏజెంట్లుగా పెట్టి...
పొలింగ్ బూత్‌లో ఓట్లు లేని వ్యక్తులను ఏజెంట్‌లుగా కూర్చోపెట్టి వారి ద్వారా రిగ్గింగ్‌కు పాల్పడేందుకు కూటమి నేతలు ప్రయత్నించారు. నగరంలోని చాలా డివిజన్‌లలో ఇదేరీతిలో వ్యవహరించేందుకు కుట్రలు పన్నారు. దానిపై వైఎస్సార్‌సీపీ గట్టిగా ప్రశ్నించటంతో అధికారులు వారిని బయటకు పంపించి వేశారు. అయితే కొన్ని చోట్ల బయట వ్యక్తులు బూత్‌లో ఏజెంట్లుగా కూర్చోని కూటమికి మద్దతుగా వ్యవహరించారు. అలాగే పశ్చిమంలో బుద్దా వెంకన్న 31వ డివిజన్‌లో రిగ్గింగ్ చేయటానికి ప్రయత్నించారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా తన అనుచరులతో రజకపేట స్కూల్‌కు వచ్చి రిగ్గింగ్‌కు యత్నించారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలు అక్కడకు రావటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అరాచకానికి అండగా పోలీసులు
కూటమి నేతలు చేసే ఆరాచకాలకు పోలీసులు అండగా నిలిచారు. అక్రమాలు జరిగిన ప్రాంతాల్లో పలు చోట్ల వివాదాలు చోటు చేసుకున్నాయి. అయితే వివాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు దానిని ప్రశ్నించిన వారిని పోలీసుస్టేషన్లకు తీసుకువెళ్లటం, జీప్‌లు ఎక్కించటం, బెదిరించటం వంటి చర్యలు దాదాపుగా అన్ని డివిజన్‌లలోనూ చోటు చేసుకున్నాయి.


